Skip to main content

సంఝౌతా కేసులో తీర్పు వెలువరించిన కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మార్చి 20న తీర్పు వెలువరించింది.
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి జగ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

అసలేం జరిగింది?
ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే ఉన్నారు. అక్షర్‌ధామ్(గుజరాత్), సంకట్‌మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సంఝౌతా కేసులో తీర్పు వెలువరించిన కోర్టు
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు
ఎక్కడ : పంచకుల, హరియాణ
Published date : 21 Mar 2019 05:22PM

Photo Stories