రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన
Sakshi Education
కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పేరుతో రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే మూడు నెలలపాటు ఈ ప్యాకేజీని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 26న వెల్లడించారు.
ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ చర్యలు...
- దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల నిరుపేద రేషన్ కార్డు దారులకు 5 కిలోల చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పుధాన్యాలు అందజేత. వీటిని లబ్ధిదారులు రెండు విడతల్లో తీసుకోవచ్చు.
- దేశవ్యాప్తంగా నిరుపేద మహిళల 20.4 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు అందుతాయి.
- నిరుపేద మహిళల కోసం 2016 నుంచి అమలు చేస్తున్న ఉచిత వంటగ్యాస్ పథకంలో భాగంగా వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఎల్పీజీ. అదేవిధంగా, పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000 పంపిణీ.
- పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ఏడాదికిచ్చే రూ.6 వేలను విడతలు వారీగా ముందుగానే అందజేత. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 వేలను ఏప్రిల్ మొదటి వారంలో అందజేస్తారు.
- నెలకు రూ.15 వేల కంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులు 90 శాతం (100 మంది లోపు) ఉండే చిన్న సంస్థలకు వచ్చే మూడు నెలలపాటు వారి పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనివల్ల 4.8 కోట్ల పీఎఫ్ అకౌంట్లు నిరాటంకంగా కొనసాగుతాయి.
- దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఉపాధి హామీ సిబ్బంది రోజువారీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంపు
- దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
- చిన్న సంస్థల ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేదా మూడు నెలల వేతనం (ఏది తక్కువుంటే అది)లో 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే వీలు కల్పించింది.
- ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటంలో ముందుండే వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య, పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆరోగ్య బీమా. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది.
ప్రభుత్వంపై పడే భారం:
ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 8.7 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున అందజేయడానికి ప్రభుత్వం రూ.16వేల కోట్లు.. ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీకి రూ.45 వేల కోట్లు.. జన్‌ధన్ అకౌంట్లలో డబ్బు జమ చేయడానికి రూ.31 వేల కోట్లు. ఉచిత వంటగ్యాస్ కోసం మరో రూ.13 వేల కోట్లు వెచ్చించనుంది.
Published date : 27 Mar 2020 06:39PM