Skip to main content

రద్దు చేసిన సెక్షన్‌ కింద కేసులా?

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద ఇంకా కేసులు నమోదు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ సెక్షన్‌ను రద్దు చేస్తూ 2015 మార్చి 24న శ్రేయా సింఘాల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఉద్ఘాటించింది. 66ఏ సెక్షన్‌ కింద కేసులు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ), హైకోర్టులకు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంది.

సెక్షన్‌ 66ఏను సవాలు చేస్తూ తొలుత మహారాష్ట్రకు చెందిన న్యాయ విద్యార్థి శ్రేయా సింఘాల్‌ 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సెక్షన్‌ను 2015లో కోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ కింద కేసులు నమోదవుతున్నాయి.

ఏమిటీ సెక్షన్‌ 66ఏ?
అభ్యంతరకరమైన, సమాజంలో అశాంతిని సృష్టించే అవకాశం ఉన్న సందేశాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు సెక్షన్‌ 66ఏను చేర్చారు. ఇలాంటి సందేశాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు రుజువైతే దోషికి మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. సెక్షన్‌ 66ఏ కింద దేశవ్యాప్తంగా పోలీసులు వేలాది కేసులు నమోదు చేశారు.
Published date : 04 Aug 2021 12:56PM

Photo Stories