పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ తొలగింపు
ఈ మేరకు ఫిబ్రవరి 16న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
తొలి మహిళా ఐపీఎస్...
కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన ఆమె పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తూ 2007 డిసెంబర్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.
మైనారిటీలో ప్రభుత్వం...
పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ప్రస్తుతం స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది.