Skip to main content

ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందం?

ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందం ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్- ఆర్‌సీఈపీ)’పై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు నవంబర్ 15న సంతకాలు చేశాయి.
Current Affairs

ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక వర్చువల్ సదస్సు-2020 సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ఆర్‌సీఈపీ ప్రాతినిధ్యం వహించనుంది.

ఆర్‌సీఈపీపై సంతకాలు చేసిన 15 దేశాలు...

  1. చైనా
  2. జపాన్
  3. దక్షిణ కొరియా
  4. న్యూజిలాండ్
  5. ఆస్ట్రేలియా
  6. ఇండోనేసియా
  7. మలేసియా
  8. ఫిలిప్పైన్స్
  9. థాయిలాండ్
  10. సింగపూర్
  11. బ్రూనై
  12. వియత్నాం
  13. లావోస్
  14. మయన్మార్
  15. కాంబోడియా


సదస్సు ఆతిథ్య దేశం?
ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు-2020 కోవిడ్-19 ముప్పు కారణంగా వర్చువల్‌గా జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వర్చువల్ సదస్సుకు వియత్నాం ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం వియత్నాం ప్రధానమంత్రిగా గ్యుయెన్ జువాన్ ఉన్నారు.

ఇది చదవండి: ఆర్‌సీఈపీ సదస్సు-2019 ఎక్కడ జరిగింది, ఆర్‌సీఈపీలో భారత్ చేరకపోవడానికి కారణాలు, చైనా లక్ష్యాలు, 2012 నవంబర్‌లో ప్రారంభమైన ఆర్‌సెప్ చర్చల్లో ఎన్ని దేశాలు పాలు పంచుకున్నాయి?

భారత్ నిర్ణయం...?
ఆర్‌సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఆర్‌సీఈపీ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్ 2019 ఏడాది వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. కాగా.. సౌత్ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్‌లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Published date : 16 Nov 2020 05:51PM

Photo Stories