Skip to main content

ప్రముఖ న్యాయ కోవిదుడు రామ్ జెఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 8న ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జెఠ్మలానీ అంత్యక్రియలు సెప్టెంబర్ 8న ఢిల్లీలో లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. 1923 సెప్టెంబర్ 14వ తేదీన సింథ్(పాకిస్తాన్)లోని షికార్‌పూర్‌లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు. అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.

దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి జెఠ్మలానీ చేరుకున్నారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది.

రాజకీయంగానూ పేరు..
అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా జెఠ్మలానీ పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది.

వాదించిన కేసుల్లో కొన్ని..
సుదీర్ఘ వృత్తి జీవితంలో జెఠ్మలానీ అనేక అంశాలను చేపట్టారు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్‌ల తరఫున కూడా వాదించారు.
  • దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా
  • మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున
  • హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల కేసుల్లో
  • 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జిలానీ తరఫున
  • విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
  • హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా తరఫున
  • దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున
  • 2013లో మైనర్‌పై రేప్ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 10 Sep 2019 08:23PM

Photo Stories