Skip to main content

Paralympics-2020: పారాలింపిక్స్‌లో భారత బృందానికి ఫ్లాగ్‌ బేరర్‌గా ఎవరు వ్యవహరించారు?

టోక్యో పారాలింపిక్స్‌–2020 జపాన్‌ రాజధాని నగరం టోక్యోలో 2021, ఆగస్టు 24న ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎగసేందుకు ప్రయత్నించే దివ్యాంగ క్రీడాకారుల ఆశలను ప్రతిబింబించేలా ‘మాకూ రెక్కలున్నాయి’ అనే నేపథ్యంతో ప్రారంభోత్సవాలు జరిగాయి. ఆగస్టు 25 నుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కాగా... సెప్టెంబర్‌ 5 వరకు ఈ క్రీడలు జరుగుతాయి.

భారత ఫ్లాగ్‌ బేరర్‌గా టెక్‌ చంద్‌...
టోక్యో పారాలింపిక్స్‌లో భారత జట్టు మార్చ్‌పాస్ట్‌కు సంబంధించి అనూహ్య మార్పు చోటు చేసుకుంది. భారత ఫ్లాగ్‌ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. టోక్యోకు మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడు ఒకడు కరోనా పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్‌ చంద్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా ముందుకు సాగాడు.

విశేషాలు...
  • మొత్తం 4,403 మంది ఆటగాళ్లు టోక్యో పారాలింపిక్స్‌–2020లో పాల్గొంటున్నారు.
  • మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 162 జట్లకు చెందిన బృందాలు పాల్గొనగా రెఫ్యూజీ పారాలింపిక్‌ టీమ్‌ అందరికంటే ముందుగా నడిచింది.
  • అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అఫ్గాన్‌ జట్టు పోటీల నుంచి తప్పుకుంది. అయితే వారికి సంఘీభావంగా ఒలింపిక్‌ కమిటీ తమ వాలంటీర్‌ ద్వారా మార్చ్‌పాస్ట్‌లో అఫ్గాన్‌ జాతీయ జెండాను ప్రదర్శించింది.
  • ముగ్గురు జపాన్‌ పారా అథ్లెట్లు యు కమిజి, షున్‌షుకె ఉచిదా, కరిన్‌ మరిసకి సంయుక్తంగా ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించడంతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి.
  • కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఈ క్రీడలను మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో పారాలింపిక్స్‌–2020గానే పరిగణిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్‌–2020 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 24, 2021
ఎవరు : జపాన్‌ ప్రభుత్వం
ఎక్కడ : టోక్యో, జపాన్‌
Published date : 25 Aug 2021 07:00PM

Photo Stories