Skip to main content

Pandemic: 2080లో కరోనా లాంటి మహమ్మారి వచ్చే అవకాశం

మరో 60 ఏళ్లలోనే కరోనా లాంటి మహమ్మారి ప్రజల్ని కాటేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అత్యంత అరుదుగా సంభవించే కరోనా లాంటి వైరస్‌లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకు ఒక్కసారి కాదని, వచ్చే 60 ఏళ్లలో.. అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని అధ్యయనం తెలిపింది. ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనానికి ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్‌ మార్కో మరాని నేతృత్వం వహించారు.

అధ్యయనంలోని వివరాలు...
  • ప్రపంచ దేశాలపై కోవిడ్‌–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2 శాతం అవకాశం ఉంది
  • 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్‌ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది.
  • 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్‌ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9 శాతం వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది.
  • మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.
  • ఇలాంటి వ్యా«ధుల ముప్పు అధికం కావడానికి జనాభా పెరుగుదల, ఆహార విధానంలో మార్పులు, పర్యావరణం ధ్వంసం, వ్యాధి కారక జంతువులతో మనుషులు కలిసిమెలిసి తిరగడం వంటి కారణాలెన్నో ఉన్నాయి.
Published date : 26 Aug 2021 06:29PM

Photo Stories