Skip to main content

పణజిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

గోవా రాజధాని పణజిలో సెప్టెంబర్ 20న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 37వ సమావేశం జరిగింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్ సామర్థ్యమున్న పెట్రోల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు 2019, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నిర్మలా పేర్కొన్నారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు.

జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
  • 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గింపు
  • వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీ 5 నుంచి 1.5 శాతానికి తగ్గింపు
  • విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గింపు
  • వెట్ గ్రైండర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
  • ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గింపు
  • ప్యాకింగ్ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారణ
  • జీఎస్టీ రిజస్ట్రేషన్ సందర్భంగా ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారం
  • కెఫిన్ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంపు. దీనిపై అదనంగా 12 శాతం సెస్ విధింపు.
  • మెరైన్ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు.
  • రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంపు.
  • అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించడం.
  • ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు.
  • రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు.
  • ఔట్‌డోర్ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గింపు.

జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే..
పలు ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి నిర్మలా ప్రకటించారు. జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినవి....
  • భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులు.
  • అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలు
  • ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులు
  • ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినం
  • చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని మంత్రి తెలిపారు.
Published date : 21 Sep 2019 06:34PM

Photo Stories