Skip to main content

పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు డిసెంబర్ 4న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairsపాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి.

చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారు.

కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని..
  • వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు.
  • కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
  • ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు
Published date : 05 Dec 2019 05:43PM

Photo Stories