Skip to main content

పానీ బచావో పైసే కమావో పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?

భూగర్భ జలాల పరిరక్షణతోపాటు విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘‘పానీ బచావో పైసే కమావో’’ పథకాన్ని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
‘విద్యుత్‌ ఆదా చేయండి.. భూగర్భ జలాలను సంరక్షించండి.. ఆ మేర డబ్బులు పొందండి’ అనే అంశం ప్రధానంగా దీనిని అమలు చేస్తున్నారు. పంజాబ్‌లో ఈ పథకం విజయ వంతంగా కొనసాగుతోందని.. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నీతి ఆయోగ్‌ ఇటీవల సిఫార్సు చేసింది.

వృథా అవుతుండటంతో...
పంజాబ్‌ రాష్ట్రంలో వరి, గోధుమ పంటల సాగు విస్తారంగ జరుగుతోంది. నీటి అవసరం అధికంగా ఉండే ఈ పంటల కోసం అక్కడి రైతులు.. పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను, విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అవసరానికి మించి భూగర్భ జలాలను తోడుతుండడంతో.. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. మరోవైపు విద్యుత్‌ వృధా అవుతోందని అధికారులు గుర్తించారు. దీనికి పరిష్కారంగానే పానీ బచావో పైసే కమావో పథకాన్ని తెరపైకి తెచ్చారు.

ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంతో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలోని ‘అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జేపాల్‌)’ ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీని అమలుకు ‘ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టెరీ), పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ, ఐటీ పవర్‌ ఇండియా (ఐటీపీఐ)’సంస్థలు సహకారం అందిస్తున్నాయి.

పైలట్‌ ప్రాజెక్టుగా...
పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎస్‌పీసీఎల్‌) 2018లో ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టింది. నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్‌ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్‌ విద్యుత్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2018 ఏడాదిలో పానీ బచావో పైసే కమావో పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
ఎవరు : పంజాబ్‌
ఎక్కడ : పంజాబ్‌ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : భూగర్భ జలాల పరిరక్షణతోపాటు విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించడానికి...
Published date : 23 Aug 2021 05:53PM

Photo Stories