Skip to main content

ఒపెక్‌ కూటమి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్‌ చెప్పే దిశగా భారత్‌ చర్యలు తీసుకుంటోంది.
Current Affairs
ఇందులో భాగంగా క్రూడాయిల్‌ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ఏప్రిల్‌ 2న ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. మధ్యప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్రా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు జరిపే అవకాశాలను అన్వేషించాలని సూచించింది. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. చమురు అవసరాల కోసం భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85 శాతం పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది.

సౌదీతో వివాదం ఇదే..
చమురు ధరలు 2021, ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పడు... కరోనా నేపథ్యంలో 2020 ఏడాదిలో అమలు చేసిన నియంత్రణలను సడలించుకుని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీను భారత్‌ కోరింది. దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది.

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌(ఒపెక్‌-OPEC)...
ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా 1960లో ఇరాక్‌లో ఒపెక్‌ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయంను మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 13. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రస్తుతం ఒపెక్‌ ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ సనుసి బర్కిండో వ్యవహరిస్తున్నారు.


ఒపెక్‌ కూటిమిలోని ప్రస్తుత సభ్యదేశాలు(13):
అల్జీరియా
అంగోలా
ఈక్వటోరియల్‌ గినియా
గబాన్‌
ఇరాన్‌
ఇరాక్‌
కువైట్‌
లిబియా
నైజీరియా
రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
సౌదీ అరేబియా
యూఏఈ
వెనిజులా
Published date : 03 Apr 2021 05:50PM

Photo Stories