Skip to main content

న్యూజిలాండ్ ఉగ్రవాద దాడిలో 49 మంది మృతి

క్రైస్ట్‌చర్చ్: ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మారణహోమం.
ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం(మార్చి 15న) న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటుచేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలీడంలేదని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ అవెన్యూ మసీదుల మధ్య దూరం దాదాపు ఐదు కిలోమీటర్లు కాగా, రెండు చోట్లా కాల్పులు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకున్నాయి. దీంతో రెండు మసీదుల్లో కాల్పులు జరిపింది ఒక్క ఉగ్రవాదేనా లేక ఇద్దరున్నారా అన్న విషయంపై స్పష్టతరాలేదు. కాగా, కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో తప్పించుకుంది. వారంతా అల్‌నూర్ మసీదుకు బస్సులో వెళ్తుండగా, బస్ మసీదు వద్దకు చేరాక, ఆటగాళ్లు ఇంకా బస్‌లో ఉండగానే కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం.

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి: ప్రధాని జసిండా
న్యూజిలాండ్‌లో ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ప్రధాని జసిండా మాట్లాడుతూ ‘ఇది ఉగ్రవాద దాడేనన్న విషయం స్పష్టమవుతోంది. న్యూజిలాండ్‌కు అత్యంత చీకటిరోజుల్లో ఇదొకటి. ఇది పక్కాగా ప్రణాళిక రచించి జరిపిన దాడి’ అని చెప్పారు. ఎంత మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జసిండా వెల్లడించారు. రెండు భారీ పేలుడు పరికరాలను మిలిటరీ గుర్తించి నిర్వీర్యం చేసిందన్నారు. ఇది అసాధారణ, ఎవరూ ఊహించని హింసాత్మక ఘటన అని ఆమె పేర్కొన్నారు. అల్ నూర్ మసీదు వద్ద 41 మంది, లిన్‌వుడ్ అవెన్యూ మసీదు వద్ద ఏడుగురు చనిపోయారనీ, ఇంకొకరు ఎక్కడ చనిపోయిందీ స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్తగా న్యూజిలాండ్‌లో శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు వెళ్లవద్దని పోలీసులు కోరారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
న్యూజిలాండ్‌లోని మసీదుల్లో ఉగ్రవాదుల దాడిలో 49 మంది మృతి
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : క్రైస్ట్‌చర్చ్ సిటీ ( న్యూజిలాండ్)
Published date : 16 Mar 2019 06:15PM

Photo Stories