Skip to main content

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది.
ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 23న ఆవిష్కరించారు. అలాగే జలియన్ వాలాబాగ్ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైనికుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు: జనవరి 23
ఎందుకు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా
Published date : 24 Jan 2019 05:42PM

Photo Stories