Skip to main content

నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం

ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం లభించింది.
Current Affairsరాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 3 వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన 23 మంది రచయితల్లో కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య ఉన్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు 2020, ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు.

కొంగవాలు కత్తికి యువ పురస్కార్
గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ లభించింది. అదేవిధంగా బెలగం భీమేశ్వరరావు రచన ‘తాత మాట వరాల మూట’కు ‘బాల సాహిత్య పురస్కారం’ దక్కింది.

నారాయణస్వామి నేపథ్యం...
బండి నారాయణస్వామి 1952 జూన్ 3న అనంతపురం జిల్లా పాతూరులో హన్నూరప్ప, పోలేరమ్మ దంపతులకు జన్మించారు. ఎంఏ, బీఈడీ చేసిన ఆయన 30 ఏళ్లపాటు ఉపాధ్యాయునిగా పని చేశారు. నారాయణస్వామి రచించిన తొలికథ పరుగు కాగా, గద్దలాడతాండాయి పేరిట తొలి నవల రచించారు. వీరగల్లు (కథల సంపుటి), రంకె (పెద్ద కథ), మీ రాజ్యం మీరేలండి, నిసర్గమ్, రెండు కలల దేశమ్, శప్తభూమి (నవలలు) ఆయన రచనల్లో పేరొందాయి.

శప్తభూమి : రాయలసీమ చరిత్ర ఆధారంగా శప్తభూమి నవలను నారాయణస్వామి రచించారు. శ్రీకృష్ణదేవరాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, ప్రజలు, పాలకుల సంగతులు ఇందులో ఉన్నాయి. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ
ఎందుకు : రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు
Published date : 19 Dec 2019 05:58PM

Photo Stories