Skip to main content

ముగ్గురు బిడ్డల విధానానికి ఆమోదం తెలిపిన ఆసియా దేశం?

ఆసియా దేశం చైనా ముగ్గురు బిడ్డల విధానానికి ఆమోదం తెలిపింది.
ఇందుకు సంబంధించిన రివైజ్డ్‌ పాపులేషన్‌ అండ్‌ ఫామిలీ ప్లానింగ్‌ లాకు ఎన్‌పీసీ(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌)కు చెందిన స్టాండింగ్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ఎన్‌పీసీలో చర్చకు పెట్టి అధికారికంగా అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం చైనా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందింస్తుంది. పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చైనా యువత పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో జననాల రేటు బాగా తగ్గింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకే కొత్త చట్టం తెచ్చారు.

వికటించిన వన్‌ ఛైల్డ్‌ విధానం
గతంలో చైనాలో విపరీతంగా జనాభా పెరగడంతో కచ్ఛితమైన జనాభా నియంత్రణను అవలంబించారు. వన్‌ ఛైల్డ్‌ విధానంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు తరుగుదల ఆశించినంతగా మెరుగుపడకపోవడం, మరోవైపు 60ఏళ్ల పైబడిన జనాభాలో వృద్ధి వేగమవడంతో తాజాగా ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు.

భారత్‌ దాటేస్తుంది...
చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్‌ దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2025కు చైనా జనాభా వృద్ధిలో నెగిటివ్‌ గ్రోత్‌ ఉంటుందని చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ సైతం అభిప్రాయపడింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ముగ్గురు బిడ్డల విధానానికి ఆమోదం తెలిపిన ఆసియా దేశం?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : చైనా
ఎందుకు : చైనాలో జనాభా తరుగుదల కారణంగా...
Published date : 21 Aug 2021 06:00PM

Photo Stories