Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 11, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 11th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 11th 2023 Current Affairs

BSF Recruitment: మాజీ అగ్నివీర్‌లకు బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ 
సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్‌ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్‌ఎఫ్‌ జనరల్‌ డ్యూటీ కేడర్‌(నాన్‌ గెజిటెడ్‌) రిక్రూట్‌మెంట్‌–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి బ్యాచ్‌ మాజీ అగ్నివీర్‌లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్‌ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

Karnataka Election: కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై 
కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్ మార్చి 10వ తేదీ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. 

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా.. ఈయ‌న చ‌దివింది మ‌న హైద‌రాబాద్‌లోనే..!

Xi Jinping: చైనా అధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్   
డ్రాగన్‌ దేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(69) సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశాధ్యక్షుడిగా, సైన్యాధిపతిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిన్‌పింగ్‌ ఎన్నికకు చైనా పార్లమెంట్ మార్చి 10వ తేదీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఆయన చైనా అధ్యక్షుడిగా, అత్యంత శక్తివంతమైన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) చైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. ఒకవైపు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతుండడం, మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో జిన్‌పింగ్‌ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన జీవితకాలం ఇదే పదవిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్ని 2018లో సవరించారు.   
ఉపాధ్యక్షుడిగా హన్‌ జెంగ్‌  
జిన్‌పింగ్‌ను మరోసారి దేశాధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా నియమిస్తూ అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) చేసిన ప్రతిపాదనను రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంట్‌గా ముద్రపడిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) లాంఛనంగా ఆమోదించింది. పార్లమెంట్‌లోని 2,952 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. చైనాలో ఒక నాయకుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. జిన్‌పింగ్‌ కంటే ముందు పనిచేసిన అధ్యక్షులంతా రెండు పర్యాయాలే(10 సంవత్సరాలు) పదవీలో కొనసాగారు. చైనా మాజీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హన్‌ జెంగ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్‌పీసీ నియమించింది. గత ఏడాది అక్టోబర్‌ జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ప్లీనరీలో జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మావో జెడాంగ్‌ తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైజిన్‌పింగ్‌ రికార్డుకెక్కారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

దూకుడు పెంచుతారా?  
జిన్‌పింగ్‌ చేతిలో ప్రస్తుతం మూడు శక్తివంతమైన పదవులు ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరోసారి కుర్చీ దక్కడంతో జిన్‌పింగ్‌ దూకుడు పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. పొరుగు దేశం భారత్‌పై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. సెంట్రల్‌ కేబినెట్‌(స్టేట్‌ కౌన్సిల్‌)కు నేతృత్వం వహిస్తున్న చైనా ప్రధాని (ప్రీమియర్‌) లీ కెకియాంగ్‌ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్‌ను శనివారం ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.   



India-Australia Talks: ద్వైపాక్షిక అంశాలపై ప్ర‌ధాని మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ చ‌ర్చ‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌తో మార్చి 10వ తేదీ సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరిణామాలతోపాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, పరస్పర సహకారం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఖనిజాలు, వలసలు, సప్లై చైన్లు, విద్యా, సాంస్కృతికం, క్రీడల్లో ఇకపై కలిసి పనిచేయాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అంగీకారానికొచ్చారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి ఆల్బానీస్‌ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ్రస్టేలియాలో ఖలిస్తాన్‌ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండడాన్ని గుర్తుచేశారు.
క్రీడలు, నవీన ఆవిష్కరణలు, ఆడియో–విజువల్‌ ప్రొడక్షన్, సౌర విద్యుత్‌ విషయంలో పరస్పర సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై భారత్, ఆ్రస్టేలియా ప్రతినిధులు సంతకాలు చేశారు. చర్చల అనంతరం ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ్రస్టేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు గత కొన్ని వారాలుగా మీడియాలో నిత్యం వార్తలు వస్తుండడం నిజంగా విచారకరం. అలాంటి దాడులు భారత్‌లో ప్రతి ఒక్కరికీ సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ్రస్టేలియా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ్రస్టేలియాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అల్బానీస్‌ నాకు హామీ ఇచ్చారు. భారతీయుల భద్రత విషయంలో ఆ్రస్టేలియా ప్రభుత్వానికి సాధ్యమైనంతవరకూ మా వంతు సహకారం అందిస్తాం’’ అని పేర్కొన్నారు.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Bill Gates: ప్రగతి పథంలో భారత్‌.. బిల్‌గేట్స్

ఇరాన్, సౌదీ అరేబియా స్నేహగీతం 
ప్రత్యర్థి దేశాలుగా ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న ఇరాన్, సౌదీ అరేబియా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు, రాయబార కార్యాలయాలను తెరిచేందుకు ఇరు దేశాలు మార్చి 10వ తేదీ అంగీకారానికొచ్చాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఏడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. చైనా చొరవతో మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఇక తప్పినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. గల్ఫ్‌లోని అరబ్‌ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపకుండా చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, సౌదీ అరేబియా నడుమ ఇటీవలే సయోధ్య కుదిర్చింది. ఇది చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్, సౌదీ అరేబియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే, దీనిపై చైనా మీడియా ఇంకా స్పందించలేదు. యెమెన్‌లో ఇరాన్, సౌదీ అరేబియా ఘర్షణలు కూడా సమసేలా కనిపిస్తున్నాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
 

India-Australia: రక్షణ బంధం బలోపేతం.. ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్‌ 
భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆ్రస్టేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటించారు. ‘ఎక్సర్‌సైజ్‌ మలబార్‌’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్‌ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను మార్చి 9వ తేదీ ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్‌ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆ్రస్టేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆ్రస్టేలియాలో ఎక్సర్‌సైజ్‌ మలబార్‌ నిర్వహించనున్నాం. వాటిలో భారత్‌ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. 
రక్షణ మంత్రుల చర్చలు 
రక్షణ రంగంలో ఆ్రస్టేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.

North Korea: చుక్కలు చూపిస్తున్న‌ సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220


Ram Chandra Poudel: నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో ప్రధానమంత్రి ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.  అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రను ఎన్నిక కోసం తెరవెనుక ప్రచండ పన్నిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి పార్లమెంటులో రెండో అతి పెద్ద పార్టీ సీపీఎన్‌–యూఎంఎల్‌ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిస్తే నేపాల్‌ ప్రభుత్వంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండేది.    

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

India-Pakistan: ఇకపై కవ్వింపులకు దిగితే.. పాక్‌తో సమరమే!? 
పాకిస్తాన్, చైనాలతో భారత్‌ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్‌ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంద‌ని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్‌ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్‌ ఘర్షణ, తాజాగా అరుణాచల్‌ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. 
చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్‌ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్‌ సెలెక్ట్‌ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

GST Collections: జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు..

Reliance Jio: జియో చేతికి యూఎస్‌ కంపెనీ.. డీల్‌ విలువ రూ.492 కోట్లు 
డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా యూఎస్‌ కంపెనీ మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు 6 కోట్ల డాలర్ల(రూ.492 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కమ్యూనికేషన్‌ సంబంధ పరికరాలు తయారు చేసే మిమోసా కొనుగోలుతో 5జీ టెలికం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుంది. అనుబంధ సంస్థ రాడిసిస్‌ కార్పొరేషన్‌ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ పేర్కొంది. రుణరహిత, క్యాష్‌ ఫ్రీ ప్రాతిపదికన మిమోసాను సొంతం చేసుకునేందుకు ఎయిర్‌స్పాన్‌ నెట్‌వర్క్స్‌ హోల్డింగ్స్‌తో 6 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. మిమోసా వైఫై–5 ఆధారిత పాయింట్‌ టు మల్టీపాయింట్‌ ప్రొడక్టులతోపాటు.. ఆధునిక వైఫై 6ఈ టెక్నాలజీలు, సంబంధిత పరికరాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్‌ కొనుగోలు చేసింది. కాగా..  చైనీస్‌ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దూరం జరుగుతున్న నేపథ్యంలో మిమోసా కొనుగోలు జియో ప్లాట్‌ఫామ్స్‌కు కీలకంగా నిలవనుంది. మిమోసాకు జియో ప్రధాన కస్టమర్‌కావడం గమనార్హం!  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

Manik Saha: రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో మార్చి 8వ తేదీ జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్‌ కేబినెట్‌లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

Neiphiu Rio: నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి రియో

Air India: పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమాన సర్వీసులు 
ఆకాశంలో సగం అనే నారీశక్తి నినాదానికి మరింత మద్దతు పలికింది ఎయిర్ ఇండియా. మార్చి ఒకటో తేదీ నుంచి 90 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి మహిళా సిబ్బందితోనే నడిపింది! మార్చి 8న‌ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మొత్తం 1,825 మంది పైలెట్లలో 15 శాతం మంది అంటే 275 మంది పైలెట్లు మహిళలేనని పేర్కొంది. ఎయిర్‌ఇండియా మొత్తం సిబ్బందిలో 40 శాతానికిపైగా నారీమణులే ఉండటం విశేషం. కాక్‌పిట్‌ క్రూలో 15 శాతం అతివలే. ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది కమర్షియల్‌ ఉమెన్‌ పైలెట్లు ఉన్న దేశం భారత్‌’ అని ఎయిర్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ చెప్పారు. ‘ వైమానిక రంగ సంబంధ వృత్తులను ఎంచుకుంటున్న భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించగలిగే అవకాశం వచ్చింది’ అని ఆయన అన్నారు.  

Cabinet Committee: రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు

NISAR: సంయుక్త నిసార్‌ ఇస్రో చేతికి
అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్‌ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా–ఇస్రో సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌(నిసార్‌)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారుచేయగా ఆ దేశ వాయుసేనకు చెందిన సీ–17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది. ‘నిసార్‌ భారత్‌కు మార్చి 8న‌ వచ్చేసింది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిౖలైట్‌ తుది ఇంటిగ్రేషన్‌ మొదలైంది’ అని చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ట్వీట్‌ చేసింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు తదితరాల కోసం నిసార్‌ను వినియోగించనుంది. ఏపీలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాదిలో ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

అంగారకుడిపై సూర్యకిరణాలు
అంగారకునిపై సూర్య కిరణాలు కనువిందు చేశాయి. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం.  

Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..

Published date : 11 Mar 2023 06:28PM

Photo Stories