మిజో పుంచీకు భౌగోళిక గుర్తింపు
Sakshi Education
మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్‌లోహ్‌పున్, మిజో పుంచీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించింది.
అలాగే కేరళలోని తిరూరు తమలపాకు, తమిళనాడులోని ప్రసిద్ధ పళని దేవస్థానం ప్రసాదమైన పంచామృతాని కూడా జీఐ ట్యాగ్ లభించింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఆగస్టు 16న ప్రకటించింది.
- తావ్‌లోహ్‌పున్(చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం)ను మిజోరం రాష్ట్రమంతటా ఉత్పత్తి చేస్తుంటారు. ఇక మిజో పూంచీ అనే శాలువను, మిజో సంప్రదాయ పండుగల సందర్భాల్లో నృత్యాల్లో ధరిస్తుంటారు.
- తిరూరు తమలపాకు రకాన్ని కేరళలోని మలప్పురం జిల్లా వ్యాప్తంగా పలు తాలూకాల్లో పండిస్తుంటారు. ఈ తమలపాకులో పలు ఔషధ లక్షణాలతోపాటు కొంత మేర ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది.
- పళనిలో దండయుతపాణి స్వామికి అభిషేక సేవలో వినియోగించే పంచామృతాన్ని అరటిపండు, బెల్లం, ఆవు నెయ్యి, తేనె, యాలకులు కలిపి చేస్తారు. ఎటువంటి రసాయన ప్రిజర్వేటివ్‌లు (పదార్థం పాడవకుండా ఉంచేందుకు) కలపకుండా సహజ పద్ధతుల్లో చేయడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని ఓ దేవాలయానికి చెందిన ప్రసాదానికి ఈ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి.
- జీఐ ట్యాగ్ వల్ల ఆయా ఉత్పత్తులకు మరింత గుర్తింపుతోపాటు మంచి ధర కూడా లభిస్తుంది. భౌగోళిక మూలాలు, నాణ్యత, వాటికి ఉన్న ప్రత్యేకతలను జీఐ ట్యాగ్ తెలియజేస్తోంది.
Published date : 17 Aug 2019 04:57PM