Skip to main content

మహారాష్ట్రలో ‘రాష్ట్రపతి’ పాలన

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం నవంబర్ 12న రాష్ట్రపతి పాలన విధించింది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

రంగంలోకి రాష్ట్రపతి ఎప్పుడొస్తారంటే...
రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి, నేరుగా ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలనా యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రం నియమించిన గవర్నర్ నేతృత్వంలో పాలన సాగుతుంది. పాలనా విషయాల్లో తనకు సాయపడేందుకు అధికారులను సైతం నియమించుకునే హక్కు గవర్నర్‌కి ఉంటుంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించారు. రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మాత్రమే.

ఏఏ సందర్భాల్లో అవకాశముందంటే...
  • ఒక రాష్ట్ర శాసన సభ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన సమయంలో సీఎంను ఎన్నుకోలేనప్పుడు.
  • సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి మైనారిటీ సభ్యుల మద్దతు మాత్రమే మిగిలినప్పుడు, గవర్నర్ ఇచ్చిన సమయంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం చెందినప్పుడు.
  • సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినా రాష్ట్రపతి పాలనకు అవకాశం.
  • రాష్ట్రంలో యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు, లేదా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన సందర్భాల్లో కూడా అవకాశం ఉంది.
  • రాజ్యాంగ బద్దంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని గవర్నర్ రిపోర్టు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది.

ఎంతకాలం ఉండొచ్చు:
పార్లమెంటులోని రెండు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన ఆరునెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తరువాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడళ్ల వరకు కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో ఆరు నెలలకోసారి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.

ఎప్పుడు ఎత్తివేయొచ్చు :
పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది.

సర్కారియా కమిషన్ ఏం చెప్పింది ?
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలూ మూసుకుపోయినప్పుడు, రాష్ట్రప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలూ అంతరించి పోయినప్పుడు, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే చిట్టచివరి ప్రయత్నంగా రాష్ట్రపతి పాలన విధించాలని 1983లో సర్కారియా కమిషన్ స్పష్టం చేసింది. డాక్టర్ అంబేద్కర్ సైతం రాష్ట్రపతి పాలనను ‘‘డెడ్ లెటర్’’అని (అతి తక్కువగా ఉపయోగించాలని) అభివర్ణించారు.

ముచ్చటగా మూడోసారి...
మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్‌పవార్‌కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెప్టెంబర్ 28, 2014 నుంచి అక్టోబర్ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి: మహారాష్ట్రలో ‘రాష్ట్రపతి’ పాలన విధించారు.
ఎప్పుడు: నవంబర్ 12, 2019
ఎవరు: రాష్ట్రపతి
ఎందుకు: ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో
ఎక్కడ: మహారాష్ట్ర
Published date : 13 Nov 2019 05:49PM

Photo Stories