మధ్యయుగ కాలంనాటి విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున వెలిసింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 20న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. దేవగురువు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించగానే మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి.
కోవిడ్ పరిస్థితుల్లో...
12 ఏళ్లకోసారి జరిగే తుంగభద్ర పుష్కరాలు 2020 ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పుష్కర స్నానాలకు అనుమతి నిరాకరించింది. తలపై నీళ్లు చల్లుకుని, సంప్రదాయ పద్ధతిలో పుష్కర పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది వెంబడి 23 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు.
జోగుళాంబ వద్ద...
తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని జోగుళాంబ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుష్కరాలను ప్రారంభించారు.
తుంగభద్ర నది...
- కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని ‘చిక్‌మంగ్‌ళూరు’ జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి ‘తుంగభద్ర’గా ఏర్పడుతున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణా నదితో కలుస్తోంది.
- కృష్ణానది ఉపనదులన్నింటిలోకి తుంగభధ్ర పెద్దది.
- -తుంగభధ్ర ఉపనదులు: కుముద్వతి, వరద, వేదవతి.
- దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం తుంగభధ్ర నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం, జోగులంబా లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ నది ఒడ్డున వెలిశాయి.
- 531 కి.మీ పొడవైన తుంగభద్రా నదిపై కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ‘తుంగభద్ర ఆనకట్ట’ నిర్మించబడింది.