Skip to main content

మాతా శిశు మరణాలపై ఐరాస నివేదిక విడుదల

ప్రపంచవ్యాప్తంగా మాతా, శిశు మరణాలపై రూపొందించిన నివేదికను సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి(ఐరాస) విడుదల చేసింది.
జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు.

ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు
  • గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి.
  • ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు.
  • పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు.
  • ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు.
  • ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ.
  • ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం.
  • 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్‌లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే.
  • ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు.
  • అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు.
Published date : 20 Sep 2019 05:36PM

Photo Stories