Skip to main content

కొలువుదీరిన తెలంగాణ కొత్త మంత్రివర్గం

తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో సందడిగా జరిగింది.


గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఫిబ్రవరి 19 ఉదయం 11.30 గంటలకు పది మందితో ప్రమాణస్వీకారం చేయించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 19న కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో శాఖల కేటాయింపులో తన మార్కును ఆయన స్పష్టంగా చూపించారు. కీలకమైన ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. ప్రమాణం చేసిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు గతంలో కేటాయించిన శాఖల బాధ్యతలు అప్పగించగా.. మిగిలిన వారి శాఖలను మార్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో టి.పద్మారావుగౌడ్ నిర్వహించిన ఎకై ్సజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే వర్గానికి చెందిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అదే వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేటాయించారు. పట్నం మహేందర్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను అదే వర్గానికి చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావరణ శాఖలను.. అదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను తన సన్నిహితుడైన వేముల ప్రశాంత్‌రెడ్డికే కేసీఆర్ కేటాయించారు. టీఆర్‌ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావులు నిర్వహించిన పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి పారుదల శాఖలతోపాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్ శాఖలను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు.

శాఖల కేటాయింపు:
కె.చంద్రశేఖర్‌రావు:
ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, మంత్రులకు కేటాయించని శాఖలు
మహమ్మద్ మహమూద్ అలీ: హోం, జైళ్లు, అగ్నిమాపక.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: అటవీ,పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక,దేవాదాయ, న్యాయ.
తలసాని శ్రీనివాస్‌యాదవ్: పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ అభి వృద్ధి, సినిమాటోగ్రఫి.
గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి: విద్య
ఈటల రాజేందర్: వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు.
కొప్పుల ఈశ్వర్: ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమం.
ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా.
వి.శ్రీనివాస్‌గౌడ్: ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు.
వేముల ప్రశాంత్ రెడ్డి: రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాలు.
చామకూర మల్లారెడ్డి: కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, మహిళా-శిశు సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ఏప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : తెలంగాణ
Published date : 20 Feb 2019 05:46PM

Photo Stories