Skip to main content

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా మూడోసారి పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది.
దీంతో రెపో రేటు 5.75 శాతానికి, రివర్స్ రెపో 5.50 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో జూన్ 6న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. పాలసీ రేట్లు తగ్గడంతో వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గనుంది.

పాలసీ ప్రధానాంశాలు...
  • రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 5.75 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గింపు.
  • మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6 శాతం.
  • పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధంగా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు.
  • జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు.
  • ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4-3.7 శ్రేణిలో ఉంటుంది.
  • వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి
  • డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ చార్జీల రద్దు.
  • బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం.
  • చిన్న రుణ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు) నెలకొల్పేందుకు ‘ఆన్ ట్యాప్’ పద్ధతిలో లెసైన్సుల జారీకి ఆగస్టులో ముసాయిదా మార్గదర్శకాలు త్వరలో విడుదల.
  • పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన.
  • జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు.
  • దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు.
  • పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు.
  • తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7
  • 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా మూడుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి.
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కీలక వడ్డీ రేట్లు తగ్గింపు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)
Published date : 07 Jun 2019 05:49PM

Photo Stories