Skip to main content

కేంద్రం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఇ–రూపీ ప్రధాన లక్ష్యం?

ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చింది.
వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ను ఆగస్టు 2న న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా విస్తరించనున్నారు. ఆర్థిక సేవల విభాగం; ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ; జాతీయ ఆరోగ్య సంస్థల భాగస్వామ్యంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) దీన్ని తన యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించింది.

ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘ఇ–రూపీ ద్వారా డిజిటల్‌ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్‌ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్‌ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది’ అని పేర్కొన్నారు.

ఎలా పనిచేస్తుందంటే...
ఇ–రూపీ అనేది ఒక నగదు రహిత, కాంటాక్ట్‌ రహిత డిజిటల్‌ చెల్లింపుల సాధనం. క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ రూపంలో లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్‌కు సంబంధిత ఇ–వోచర్‌ పంపబడుతుంది. ఈ నిరాటంకమైన వన్‌–టైమ్‌ చెల్లింపు యంత్రాంగం ద్వారా యూజర్లు సర్వీసు ప్రొవైడర్ల వద్ద ఎలాంటి కార్డు, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం వంటివి అవసరం లేకుండానే వోచర్‌ను చెల్లింపుల కోసం ఉపయోగించడానికి (రిడీమ్‌) వీలవుతుంది. అదేవిధంగా ప్రైవేటుగా వ్యక్తులు అందించే విరాళాలు సంబంధిత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించే విధంగా కూడా ఇ–రూపీ వోచర్‌ వ్యవస్థ దోహదం చేస్తుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ ‘ఇ–రూపీ’ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా...
Published date : 04 Aug 2021 01:04PM

Photo Stories