Skip to main content

కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2 లక్షల సీట్లు

దేశంలోని 158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2,14,766 సీట్లను కొత్తగా సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 15న ఆమోదం తెలిపింది.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో మార్పులు చేయకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్ కల్పించేలా కేంద్రం ఈ ఏడాది మొదట్లో కొత్త చట్టం తీసుకురావడం తెలిసిందే.

2019-20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లను, 2020-21లో 95,783 సీట్లను సృష్టించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ అమలు కోసం 158 కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలకు రూ.4,315 కోట్ల నిధులు వెచ్చించేందుకు కూడా కేంద్రంఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లను 25 శాతం పెంచనున్నట్లు 2019-20 బడ్జెట్‌లోనూ కేంద్రం వెల్లడించింది. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపేముందే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈసీ నుంచి అనుమతులు తీసుకుంది.

కేబినెట్ ఇతర నిర్ణయాలు
  • రాష్ట్రాల ఆడిట్ పనుల మధ్య సమన్వయం కోసం, అలాగే ఉత్తరప్రత్యుత్తరాల పర్యవేక్షణ కోసం అదనంగా మరో ఉప కాగ్ (కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్) పదవిని సృష్టించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐదుగురు ఉప కాగ్‌లు ఉన్నారు.
  • జీఎస్‌ఎల్వీ నాలుగోదశ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద 2729.13 కోట్ల వ్యయంతో 2021-24 మధ్య ఐదు రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2,14,766 సీట్లు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం
Published date : 16 Apr 2019 06:06PM

Photo Stories