Skip to main content

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కన్నుమూత

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రాంవిలాస్ పాశ్వాన్ (74) అక్టోబర్ 8న ఢిల్లీలో కన్నుమూశారు.
Current Affairs
గత కొన్ని వారాలుగా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవలే గుండె శస్త్ర చికిత్స జరిగింది. రాజ్యసభ సభ్యుడైన పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు.

1969లోనే ఎమ్మెల్యేగా...
1946, జూలై 5న బిహార్‌లోని ఖగారియాలో జన్మించిన పాశ్వాన్ పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. అనంతర కాలంలో డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది.

లోక్‌జనశక్తి పార్టీ స్థాపన...
2000 సంవత్సరంలో పాశ్వాన్ మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు గట్టిగా ప్రయత్నం చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : రాంవిలాస్ పాశ్వాన్ (74)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా
Published date : 09 Oct 2020 05:38PM

Photo Stories