Skip to main content

కార్పొరేట్ ట్యాక్స్ 22 శాతానికి తగ్గింపు

కార్పొరేట్ ట్యాక్స్(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం 30 శాతంగా కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 20న ప్రకటించారు. దీంతో సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) నుంచే తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుందని తెలిపారు.

కేంద్రప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు
  • కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది.
  • 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది.
  • కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది.
  • కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
  • కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్‌ఆర్) తమ లాభాల్లో 2శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు.
  • 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.

Current Affairs

Published date : 21 Sep 2019 06:41PM

Photo Stories