జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్లో అస్ట్రాజెనెకా టీకాపై నిషేధం..ఎందుకంటే?
అస్ట్రాజెనెకా కరోనా టీకా తీసుకున్న కొందరిలో ప్రమాదకరమైన రీతిలో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని అధ్యయన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగానే తాము ఈ వ్యాక్సిన్‌పై నిషేధం విధించినట్లు ఇటలీ ఔషధ నియంత్రణ సంస్థ మార్చి 15వ తేదీన ప్రకటించింది. ఇటలీలో మార్చి 13న అస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 57 ఏళ్ల వ్యక్తి 14వ తేదీ ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం ఈ టీకాను పక్కనపెట్టింది. ఫ్రాన్స్, జర్మనీ కూడా అదే దారిలో నడుస్తున్నట్లు స్పష్టం చేశాయి. ఈ వ్యాక్సిన్‌పై మార్చి 16వ తేదీ మధ్యాహ్నం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తన ప్రతిపాదనలను సమర్పించనుందని, అప్పటిదాకా తమ దేశంలో దీన్ని నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తెలిపారు. జర్మనీలో అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొందరిలో దుష్ప్రభావాలు ఏర్పడినట్లు, వారి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. అయితే, తమ టీకా పూర్తి సురక్షితమని అస్ట్రాజెనెకా సంస్థ స్పష్టం చేసింది. దీనివల్ల మనుషుల్లో అపాయం తలెత్తుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్లో అస్ట్రాజెనెకా టీకాపై నిషేధం
ఎప్పుడు : మార్చి 14న
ఎక్కడ : జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్
ఎందుకు : కొందరిలో ప్రమాదకరమైన రీతిలో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని అధ్యయన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో...