Skip to main content

జియోలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు

దిగ్గజ సంస్థలు రిలయన్స్‌ గ్రూప్, ఫేస్‌బుక్‌ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి.
Current Affairs

రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్ ఏప్రిల్ 22న‌‌ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ 5.7 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్‌బుక్‌లో భాగమైన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఊతంతో దేశీ ఈ–కామర్స్‌ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్‌ రిలయన్స్‌కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. 2014లో వాట్సాప్‌ కొనుగోలు డీల్‌ తర్వాత ఫేస్‌బుక్‌ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం.


డీల్‌ ఇలా..

తాజా ఒప్పందం ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్‌ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్‌ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్‌ గ్రూప్‌ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్‌ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్‌–ఎక్స్‌క్లూజివ్‌ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్‌బుక్‌ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది.

అమెజాన్,
ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్‌ ..
తాజా డీల్‌ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్‌ రిటైల్, వాట్సాప్‌ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ విభాగం జియోమార్ట్‌ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్‌ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్‌ఐఎల్‌ వివరించింది. ఈ–కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్
Published date : 23 Apr 2020 08:46PM

Photo Stories