Skip to main content

జాబిల్లి చెంతకు చేరిన చంద్రయాన్-2

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై 22న ప్రయోగించిన చంద్రయాన్-2లోని ఆర్బిటర్‌లో ఇంధనాన్ని సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 6.21 గంటలకు 52 సెకన్లపాటు మండించి ఐదోసారి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.
బెంగళూరులోని బైలాలులో గల భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ పర్యవేక్షించారు. చంద్రయాన్-2 ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నాలుగుసార్లు ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం తాజాగా ఐదోసారి ఆపరేషన్‌ను చేపట్టి చంద్రుడికి దగ్గరగా 119 కి.మీ, చంద్రుడికి దూరంగా 127 కి.మీ, ఎత్తుకు తగ్గించారు. సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య ఆర్బిటర్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దిగేలా చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ చంద్రుడి కక్ష్యలో 100ఁ30 కిలోమీటర్లు ఎత్తులోకి చేరుకున్నాక ఆర్బిటర్ నుంచి ల్యాండర్ నెమ్మదిగా వేరు పడుతుంది. ఆ తరువాత ల్యాండర్‌ను కూడా మండించి సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రెండుసార్లు ఆపరేషన్ చేపట్టనున్నారు. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యేలా చేస్తారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
జాబిల్లి చెంతకు చేరిన చంద్రయాన్-2
ఎప్పుడు: సెప్టెంబర్ 1, 2019
ఎక్కడ: బెంగళూరు
Published date : 03 Sep 2019 06:30PM

Photo Stories