Skip to main content

ఇటీవల కన్నుమూసిన కల్యాణ్‌ సింగ్‌ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడు కల్యాణ్‌ సింగ్‌(89) కన్నుమూశారు.
అనారోగ్యంతో జూలై 4 నుంచి లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐ)లో చికిత్స పొందుతున్న ఆయన ఆగస్టు 21న తుదిశ్వాస విడిచారు. పది అసెంబ్లీ ఎన్నికల్లో 9సార్లు గెలుపొందిన కల్యాణ్‌... ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండుమార్లు పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నారు. తర్వాత జనసంఘ్‌లో అనంతరం బీజేపీలో కీలక పాత్ర పోషించారు. ఏ పార్టీలో ఉన్నా హిందూవాదాన్ని బలంగా వినిపించేవారు.

రాజస్తాన్‌ గవర్నర్‌గానూ...
కల్యాణ్‌ సింగ్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కేంద్రం యూపీ అసెంబ్లీని రద్దు చేసింది. అనంతరం 1997లో ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యారు. సొంత ఎమ్మెల్యేల నుంచే అసమ్మతి పెరగడంతో 1999 నవంబరులో బీజేపీ హైకమాండ్‌ ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించింది. తర్వాత పార్టీ నుంచి బహిష్కరించింది. కల్యాణ్‌ సింగ్‌ 2010లో జనక్రాంతి పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014లో తిరిగి బీజేపీలో చేరారు. అదే సంవత్సరం ఆయన్ను రాజస్తాన్‌ గవర్నర్‌గా నియమించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కల్యాణ్‌ సింగ్‌(89)
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా...
Published date : 23 Aug 2021 05:54PM

Photo Stories