Skip to main content

ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు.
Current Affairsఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ జనవరి 4న ట్రంప్ ట్వీట్ చేశారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.

ఇది యుద్ధ నేరం : ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు.

ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు
తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు.

కెన్యా బేస్‌పై దాడి
కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ జనవరి 5న దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.

ఇరాన్ విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్
యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జనవరి 4న ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు.

మాదిరి ప్రశ్నలు
Published date : 06 Jan 2020 06:13PM

Photo Stories