హస్తకళల మార్కెటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్?
అక్టోబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ... హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్...
- రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ-ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఆప్కో స్టోర్ ద్వారా...
ఆప్కో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్లు పొందవచ్చు.
లేపాక్షి స్టోర్ ద్వారా...
లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు.
సీఎం ప్రసంగం...
- ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పుడు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని 2021, ఫిబ్రవరి తర్వాత ఇస్తాం.
- జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి.
- జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆప్కో ఆన్‌లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్‌లు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు