Skip to main content

హరియాణా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణం

హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో అక్టోబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఖట్టర్‌తో హరియాణా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. ఖట్టర్‌తోపాటు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకుగాను బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో జేజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతును బీజేపీ కూడగట్టింది. ఫలితంగా బీజేపీ కూటమి బలం అసెంబ్లీలో 57కు చేరింది.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా..
బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్‌తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1977లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 1994లో బీజేపీలో చేరారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : మనోహర్‌లాల్ ఖట్టర్
ఎక్కడ : చండీగఢ్
Published date : 28 Oct 2019 05:32PM

Photo Stories