Skip to main content

హైదరాబాద్‌లో జల్‌జీవన్ మిషన్ సమావేశం

జల్‌జీవన్ మిషన్ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నవంబర్ 11న సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ నుంచి నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్‌మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. కేంద్రమంత్రి షేకావత్ మాట్లాడుతూ... గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జల్‌జీవన్ మిషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాలతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 12 Nov 2019 05:47PM

Photo Stories