గత రెండేళ్లుగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు..ఎందుకంటే?
Sakshi Education
భారతదేశపు అత్యధిక విలువ కలిగిన కరెన్సీ రూ.2,000 నోటును గడచిన రెండు సంవత్సరాలుగా ముద్రించడంలేదని మార్చి 15వ తేదీన ప్రభుత్వం లోక్సభకు తెలిపింది.
ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వివరాలు ఇవీ...
వివరాలు ఇవీ...
- 2018 మార్చి 30 నాటికి వ్యవస్థలో 336.2 కోట్ల కరెన్సీ నోట్లు ఉన్నాయి. మొత్తం కరెన్సీ నోట్లలో ఇది 3.27 శాతంకాగా, విలువలో 37.26 శాతం.
- 2021 ఫిబ్రవరి 26 నాటికి వ్యవస్థలో పెద్ద నోట్ల సంఖ్య 249.9 కోట్లకు తగ్గింది. నోట్ల సంఖ్యలో ఇది 2.01 శాతంకాగా, విలువలో 17.78 శాతం.
- వ్యవస్థలో నగదు లావాదేవీల డిమాండ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో సంప్రదింపుల ప్రాతిపదికన బ్యాంక్‌నోట్లను ఏ స్థాయిలో ముద్రించాలన్న అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది.
- 2019–21 సంవత్సరాల్లో రూ.2,000 నోట్ల ముద్రణకు ఎటువంటి ఇండెంట్‌ను ఇవ్వలేదు.
- 2016–17 (ఏప్రిల్ 2016– మార్చి 2017) మధ్య 354.29 కోట్ల రూ.2,000 కరెన్సీ నోట్లను ముద్రించినట్లు 2019లో ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో కేవలం 11.15 కోట్ల నోట్ల ముద్రణ మాత్రమే జరిగింది. 2018–19లో ఇది మరింత తగ్గి 4.66 కోట్లకు పడిపోయింది. 2019–20, 2020–21ల్లో రూ.2,000 నోట్ల ముద్రణే జరగలేదు.
- అధిక విలువ కలిగిన నోట్లను పెద్ద ఎత్తున దాచిపెట్టడాన్ని నిరోధించడంతోపాటు, నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడం లక్ష్యాలుగా రూ.2,000 నోటు ముద్రణను నిలిపివేయడం జరిగింది.
- రూ.500, రూ.1,000 నోట్ల ఉపసంహరణ అనంతరం 2016 నవంబర్‌లో రూ.2,000 నోట్లను వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం రూ.2,000, రూ.500 నోటుతోపాటు రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు చెలామణీలో ఉన్నాయి.
Published date : 16 Mar 2021 05:28PM