Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 6, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 6th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Telangana Budget 2023‌-24: తెలంగాణ బడ్జెట్ 2023-24 ముఖ్య‌మైన అంశాలు.. 
తెలంగాణ బడ్జెట్ 2023-24ను రాష్ట్ర‌ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ (సోమ‌వారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  
• తెలంగాణ బడ్జెట్‌ రూ.2,90,396 కోట్లు
• 2023-24 తలసరి ఆదాయం రూ.3,17,175
• రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
• మూలధన వ్యయం రూ.37,525 కోట్లు
• కేంద్ర పన్నుల వాటా రూ.21,471 కోట్లు
• ట్యాక్స్‌ మరియు ఖర్చుల పన్నుల ద్వారా ఆదాయం రూ. 650 కోట్లు
• పన్నేతర ఆదాయం రూ.22,801 కోట్లు
• కేంద్ర నిధులు రూ. 41,259.17 కోట్లు
• వాహన పన్ను ద్వారా ఆదాయం రూ.7,512 కోట్లు
• ఎలక్టిసిటీ పన్నుల ద్వారా ఆదాయం రూ.750 కోట్లు
• రియల్‌ ఎస్టేట్‌ పన్నుల ద్వారా రాబడి రూ.175 కోట్లు
• ఇతర పన్నుల సుంకాల ద్వారా ఆదాయం రూ.44.20 కోట్లు
• స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్న్‌ ద్వారా ఆదాయం రూ.18,500 కోట్లు
• ల్యాండ్‌ రెవెన్యూ ద్వారా ఆదాయం రూ. 12.5 కోట్లు
• ఎక్సైజ్‌శాఖ ద్వారా ఆదాయం రూ. 19 వేల 884.90 కోట్లు
• అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం రూ.39.500 కోట్లు
• కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.3,210 కోట్లు. 
• కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌కు రూ.200 కోట్లు
• డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.1200 ‍కోట్లు
• ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు
• టీఎస్‌ ఆర్టీసీకి రూ.1500 కోట్లు
• రవాణాశాఖకు రూ.1,644 కోట్లు
• మున్సిపల్‌ శాఖకు రూ.11 వేల 372 కోట్లు
• రోడ్లు, భవనాల శాఖకు రూ.2 వేల కోట్లు
• హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోకు రూ.500 కోట్లు
• పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీకి రూ.500 కోట్లు
• షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36 వేల 750 కోట్లు
• ఐ అండ్‌ పీఆర్‌ కోసం రూ.1000 కోట్లు
• హోంశాఖకు రూ.9 వేల 500 కోట్లు
• మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు
• మూసీ అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
• రవాణాశాఖకు రూ.1,644 కోట్లు
• గిరిజన సంక్షేమానికి రూ.3,965 కోట్లు
• పరిశ్రమలకు రూ.4,037 కోట్లు
• గ్రామాల్లో రోడ్ల కోసం రూ.2 వేల కోట్లు
• హరితహారానికి రూ.14 వేల 71 కోట్లు
• మైనారిటీ సంక్షేమానికి రూ.2 వేల 200 కోట్లు
• విద్యారంగానికి రూ.19 వేల 093 కోట్లు
• ఇరిగేషన్‌ రంగానికి రూ.26, 885 కోట్లు
• షెడ్యూల్‌ తెగలకు రూ.15,233 కోట్లు
• బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
• దళితబంధుకు రూ. 17,700 కోట్లు
• ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
• రైతు వేదికలకు రూ. 26,835 కోట్లు
• నీటి పారుదల రంగానికి రూ. 26,831 కోట్లు
• విద్యుత్‌ రంగానికి రూ.12,727 కోట్లు
• ప్రజాపంపిణీ రంగానికి రూ.3117 కోట్లు

Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

Earthquake:ట‌ర్కీ, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతుల సంఖ్య‌

ప్రకృతి ప్రకోపానికి ట‌ర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

ట‌ర్కీ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది.  భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. తుర్కియేలోని దియర్‌బకీర్‌, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

భారీగా పెరుగుతున్న మరణాలు..
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 912 మంది మరణించ‌గా, 5300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తెలిపారు. భూకంప తీవ్రతకు తుర్కియేలో దాదాపు 3000 భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 326 మంది మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్‌ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 400 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (15-21 జనవరి 2023)

సాయానికి ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు..
తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు స‌హాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్‌ సహా నెదర్లాండ్స్‌, గ్రీస్‌, సెర్బియా, స్వీడన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.
తరచూ భూకంపాలు..
తుర్కియేలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4 తీవ్రతతో భూకంపం సంభించి 17 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు. 

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యం(డీఏ) 4 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే డీఏ పర్సంటేజీ ప్రస్తుతమున్న 38% నుంచి 42%కి చేరుకుంటుంది. కార్మిక‌ శాఖ నెలవారీగా విడుదల చేసే పారిశ్రామిక సిబ్బంది వినియోగ ధరల సూచీ(సీపీఐ–ఐడబ్ల్యూ) ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం ఉద్యోగులు, పింఛనుదారుల డీఏను ఖరారు చేస్తుంటుంది. ఆల్‌ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివ గోపాల్‌ మిశ్రా తాజా వార్తలపై స్పందిస్తూ..‘డిసెంబర్‌ 2022 సీపీఐ–ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. దీని ప్రకారంగా డీఏ పెంపు 4% ఉంటుంది. అప్పుడు 42%కి చేరుకుంటుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలను తయారు చేసి కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం పంపుతుంది’అని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపితే డీఏ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలవుతుంది. ప్రస్తుతం ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 38% డీఏను పొందుతున్నారు. సెప్టెంబర్‌ 28, 2022ను రివిజన్‌ డీఏ 2022 జూలై నుంచి అమల్లోకి వచ్చింది.

High Court Judges: 554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్‌ కేటగిరీకి చేందిన‌వారే..

Astronomers: అంతరిక్షంలో బంగారం!
మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్‌ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్‌ గెహ్రెల్స్‌ స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్‌ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్‌ 1.5 మీటర్‌ టెలిస్కోప్‌ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు. అధ్యయనం ఫలితాలను నేచర్‌ జర్నల్‌లో ప్రచురించారు. 
త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్‌ స్టార్‌ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు.

Peking University: భూ భ్రమణ సమయం పెరుగుతోంది.. రోజుకు 19 గంటలే!

China Spy Balloon: చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా! 
అమెరికా గగనతలం మీదుగా ఎగురుతూ కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అట్లాంటిక్‌ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్‌–22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్‌ ఎగురుతూ కనిపించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.  దక్షిణ కరోలినా మిర్టిల్‌ బీచ్‌ సమీపంలో సముద్ర జలాల్లో 11 కి.మీ. మేరకు పడిపోయిన బెలూన్, దాని విడి భాగాల కోసం రెండు నేవీ నౌకలు, ఇతర భారీ నౌకల సాయంతో అన్వేషిస్తున్నారు. బెలూన్ని కూల్చివేసే మిషన్‌ను బైడెన్‌ స్వయంగా పర్యవేక్షించారు. ‘‘దాన్ని పేల్చివేసినప్పుడు ఎలాంటి నష్టం జరగకూడదని ఒత్తిడి ఎదుర్కొన్నాను. సైనిక సిబ్బంది విజయవంతంగా పని పూర్తి చేశారు. వారికి అభినందనలు’’ అన్నారు. 
త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందన్న చైనా 
అమెరికా తమ బెలూన్‌ను కూల్చివేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా చేసిన పనికి తగిన సమయంలో దీటుగా బదులిస్తామని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలలో పేర్కొంది. అది పౌర వినియోగం కోసం ప్రయోగించిన బెలూన్‌ మాత్రమేనని పునరుద్ఘాటించింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్‌ను అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసినందుకు తమ నుంచి త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.

Spy Balloon: నిఘా బెలూన్లు అంటే ఏమిటీ.. ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి?

ఇలా కూల్చేశారు.. 
• దాదాపు మూడు స్కూలు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ తొలిసారిగా జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది. 
• దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అమెరికా నిఘా కంటికి చిక్కింది. వెంటనే కెనడా వైపుగా వెళ్లి 30వ తేదీన తిరిగి అమెరికాలోకి ప్రవేశించింది. 
• అణ్వాయుధ క్షిపణి ప్రయోగశాల తదితరాలున్న మొంటానాపై కూడా తిరుగుతుండటంతో కలకలం రేగింది. 
• బెలూన్ కూల్చివేతకు మల్టిపుల్‌ ఫైటర్, రీ ఫ్యూయలింగ్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి దూసుకెళ్లిన ఎఫ్‌22 ఫైటర్‌ జెట్‌ పని పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ అర్ధరాత్రి దాటాక ఏఐఎం–9ఎక్స్‌ సూపర్‌సానిక్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణిని ప్రయోగించింది. వేడిని అనుసరిస్తూ దూసుకెళ్లే ఆ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. 
• ముందుజాగ్రత్తగా సమీప విల్మింగ్టన్, మిర్టిల్‌ బీచ్, చార్లెస్టన్‌ ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. 
• బెలూన్‌కు అమర్చిన నిఘా పరికరాలను అమెరికా సేకరించి పరిశీలించనుంది. సముద్రంలో 47 అడుగుల లోతుకు పడిపోయిన స్పేర్లు తదితర విడి భాగాల కోసం నేవీ డ్రిస్టాయర్‌ యూఎస్‌ఎస్‌ ఆస్కార్‌ ఆస్టిన్, డాక్‌ లాండింగ్‌ షిప్‌ యూఎస్‌ఎస్‌ కార్టర్‌ హాల్‌ వంటివాటితో పాటు నేవీ డైవర్లు గాలిస్తున్నారు.

Air Force: 2025లో అమెరికా, చైనా యుద్ధం!

 
Election Commission: దేశంలోని ఓటర్ల సంఖ్య‌ 94.5 కోట్లు
మన దేశంలో ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్‌ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడింది. అయితే ఈ ఓటర్లలో దాదాపుగా మూడో వంతు మంది ఓటుకి దూరంగా ఉండడం ప్రజాస్వామ్యంలోనే విషాదకరం. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ఇప్పట్నుంచే కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాలు పన్నుతోంది. మొట్టమొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 45.67% ఓటింగ్‌ నమోదైంది. 1957 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 19.37 కోట్లు ఉంటే 47.44% మంది ఓటు వేశారు. 2009 నాటికి ఓటర్ల సంఖ్య భారీగా 71.7 కోట్లకు పెరిగినప్పటికీ ఓటింగ్‌ శాతం 58.21 మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.20 రిజిస్టర్డ్‌ ఓటర్లు ఉంటే 67.40శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Assembly Elections 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుద‌ల‌

Pervez Musharraf: కార్గిల్‌ యుద్ధం సృష్టికర్త ముషారఫ్‌ కన్నుమూత
పాకిస్తాన్‌ మాజీ సైనిక పాలకుడు, 1999 నాటి కార్గిల్‌ యుద్ధం సృష్టికర్త జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌(79) అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా రోజులుగా అమిలాయిడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ తుదిశ్వాస విడిచారు. ముషారఫ్‌ భౌతికకాయాన్ని పాకిస్తాన్‌కు తరలించి, అంత్యక్రియలు కరాచీలో నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. స్వదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముషారఫ్‌ 2016 మార్చి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ప్రవాస జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన సూత్రధారిగా, సైనిక నియంతగా ముషారఫ్‌ అపకీర్తిని మూటగట్టుకున్నారు. ముషారఫ్‌ మరణం పట్ల పాక్‌ ప్రధానమంత్రి షెషబాజ్‌ షరీఫ్‌ సంతాపం వ్యక్తం చేశారు. త్రివిధ దళాల అధిపతులు సైతం సంతాపం తెలిపారు. ముషారఫ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.  
ఏమిటీ అమిలాయిడోసిస్‌?  
చికిత్సతో నయం కాని ఇదొక అరుదైన వ్యాధి. శరీరంలోని అవయవాలు, కణజాలంలో అమిలాయడ్‌ అనే ప్రొటీన్‌ అసాధారణంగా పెరిగిపోవడాన్ని అమిలాయిడోసిస్‌గా పరిగణిస్తారు. ఈ వ్యాధి వల్ల ఆవయవాలు పనిచేయడం క్రమంగా ఆగిపోతుంది. ముషారఫ్‌కు ఈ వ్యాధి సోకినట్లు తొలిసారిగా 2018లో బయటపడింది. ఆయన సొంత పార్టీ ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఏపీఎంఎల్‌) ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది జూన్‌లో దుబాయ్‌లో ఆసుపత్రిలో చేరారు. 3 వారాల పాటు అసుపత్రిలోనే ఉన్నారు. అప్పట్లోనే ఆయన చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.  

K.Viswanath: క‌ళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత.. ఆయ‌న‌ జీవిత ప్ర‌స్థానం ఇలా..
 
VISA: విదేశాల నుంచి అమెరికా వీసా!
అమెరికా వీసా కోసం ఇకపై సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం అరుదైన అవకాశం కల్పించింది. అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరమున్న వారు ఇతర దేశాల్లోని ఎంబసీల నుంచి కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. బీ1, బీ2 బిజినెస్, పర్యాటక వీసాలకు ప్రస్తుతం హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లో ఏడాదికి పైగా వెయిటింగ్‌ ఉంది! బ్యాంకాక్‌లో కేవలం 14 రోజుల్లోనే అపాయింట్‌మెంట్‌ దొరుకుతోంది. అందుకే అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు విదేశీ ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు. సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నంల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.



232 విదేశీ యాప్‌లపై నిషేధం 
చైనాతోపాటు వివిధ దేశాలకు చెందిన సంస్థలు నిర్వహిస్తున్న 232 బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అనధికారిక రుణ యాప్‌లపై కేంద్రం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ నిషేధం విధించింది. ఇవి దేశ ఆర్థిక స్థిరతకు ముప్పుగా మారాయని ఓ అధికారి చెప్పారు. బ్లాక్‌ చేసిన యాప్‌ల పేర్లను కేంద్రం వెల్లడించలేదు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (15-21 జనవరి 2023)


Zagreb Open 2023 Wrestling: వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో అశుకి కాంస్యం 
యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్‌ ఓపెన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో పురుషుల గ్రీకో రోమన్‌ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్‌ గ్రిగాలియునస్‌ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ.44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్‌) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్‌ చేరుకోవడంతో.. రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్‌’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్‌’ తొలి బౌట్‌లో అశు 8–0తో పోహిలెక్‌ (హంగేరి)పై.. రెండో బౌట్‌లో 9–0తో హావర్డ్‌ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు.    

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం

Tejaswin Shankar: హైజంప్‌లో తేజస్విన్‌కు స్వర్ణం
న్యూ బ్యాలెన్స్‌ ఇండోర్‌ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత్‌కు చెందిన తేజస్విన్‌ శంకర్‌ హైజంప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. 24 ఏళ్ల తేజస్విన్‌ 2.26 మీటర్ల దూరం ఎగిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2007 ప్రపంచ చాంపియన్, 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత డొనాల్డ్‌ థామస్‌ (బహామస్‌) 2.23 మీటర్లతో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అమెరికాలోని కన్సాస్‌ స్టేట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఆడిన తొలి టోర్నీలో తేజస్విన్‌ స్వర్ణం సాధించడం విశేషం. గత ఏడాది బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో తేజస్విన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. 

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సురభికి స్వ‌ర్ణం 
ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ జరిగిన జిమ్నాస్టిక్స్‌ అండర్‌–18 బాలికల టేబుల్‌ వాల్ట్‌ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్‌లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్‌ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (15-21 జనవరి 2023)

ముంబై జట్టు మెంటార్‌గా జులన్‌
డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ తమ కోచింగ్‌ బృందాన్ని ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ ప్రకటించింది. ఈ బృందంలో అందరూ మాజీ మహిళా క్రికెటర్లే ఉండటం విశేషం. ఇటీవల ఆటకు గుడ్‌బై చెప్పిన భారత బౌలింగ్‌ దిగ్గజం జులన్‌ గోస్వామిని తమ జట్టు మెంటార్, బౌలింగ్‌ కోచ్‌గా ముంబై నియమించుకుంది. 40 ఏళ్ల జులన్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 284 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 355 వికెట్లు పడగొట్టడంతోపాటు 1,924 పరుగులు సాధించింది. 2014 నుంచి 2016 వరకు భారత జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేసిన మాజీ ఆల్‌రౌండర్‌ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించారు. 2006 నుంచి 2008 మధ్యకాలంలో దేవిక భారత్‌ తరఫున ఒక టెస్టు, 15 వన్డేలు ఆడింది. 2018లో ఆసియా కప్‌ విజేతగా నిలిచిన బంగ్లాదేశ్‌ జట్టు శిక్షణ బృందంలో దేవిక సభ్యురాలిగా ఉంది.  
హెడ్‌ కోచ్‌గా చార్లెట్‌  
ముంబై జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతల్ని ఇంగ్లండ్‌ మాజీ కెపె్టన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌కు కట్టబెట్టారు. 2017లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్‌కు కోచింగ్‌లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్‌లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చార్లెట్‌ 10,273 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్‌లో సదరన్‌ వైపర్స్‌ జట్టుకు, సదరన్‌ బ్రేవ్‌ (హండ్రెడ్‌ టోర్నీ) జట్టుకు, ఆ్రస్టేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన చార్లెట్‌ అమెరికా క్రికెట్‌ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్‌ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (15-21 జనవరి 2023)

Published date : 07 Feb 2023 11:28AM

Photo Stories