Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 18, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 18th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 18th 2023 Current Affairs in Telugu

Global Warming: గ్లోబల్ వార్మింగ్‌కు.. చంద్రధూళితో చెక్‌! 

చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! 

ఏమిటీ ప్రతిపాదన..? 
చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. 
ఏమిటి సమస్య? 
• చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే..   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

BBC Tax Survey: బీబీసీలో ఆర్థిక అవకతవకలు.. కీలక ఆధారాలు లభించాయన్న సీబీడీటీ 
బీబీసీ గ్రూప్‌లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని ఫిబ్ర‌వ‌రి 17న‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్‌ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్‌ డాక్యుమెంటేషన్‌ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది.
పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్‌ మతఘర్షణలకు సంబంధించి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్‌’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది.   

Green Comet: నిష్క్ర‌మించిన ఆకుపచ్చ తోకచుక్క.. మ‌ళ్లీ 50 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌..

Twitter office: ఢిల్లీ, ముంబ‌యిలో ట్విట్ట‌ర్ కార్యాల‌యాల మూసివేత‌ 
సామాజిక మాధ్యమం ట్విటర్‌ను బిలియనీర్‌ ఎలన్‌మస్క్‌ కొనుగోలు చేసిన దగ్గర్నుంచి ఆ కంపెనీకి కష్టాలు తీరడం లేదు. కాస్ట్‌ కటింగ్‌ చర్యల్లో భాగంగా భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెంటింటిని మూసివేసింది. ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించిన ట్విటర్‌ ఉద్యోగుల్ని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. బెంగళూరులో కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తుంది. 2023 చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా గాడిలో పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న మస్క్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యాలయాలను మూసివేస్తున్నారు. గత ఏడాది చివర్లో భారత్‌లో ఉన్న ఉద్యోగుల్లో 90% మందిని ట్విటర్‌ తొలగించారు.   
భారత్‌లో 450 మందికి గూగుల్‌ ఉద్వాసన ! 
టెక్‌ దిగ్గజం గూగుల్‌లో కూడా లే ఆఫ్‌ల పర్వం మొదలైంది. భారత్‌లో ఒకేసారి 450 మందిని ఇంటికి పంపించింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా ఫిబ్ర‌వ‌రి 16 రాత్రి ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ గత నెలలో 12 వేల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులతో సంస్థ నష్టాలు చవిచూడాల్సి వస్తూ ఉండడంతో 12 వేల మందిని తొలగించడానికి నిర్ణయించుకున్నట్టు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ 10 వేలు, అమెజాన్‌ 18 వేలు, ఫేస్‌బుక్‌కు చెందిన మెటా 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.  

Job Layoffs 2023 : 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి.. కార‌ణం ఇదేనా..?

Air India: ఎయిరిండియాకు.. 6,500 మంది పైలట్లు కావాలి 
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్, బోయింగ్‌ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్‌ హాల్‌ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది.
ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

Supreme Court: ‘స్టాక్‌ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ 
స్టాక్ట్‌ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్‌ కవర్‌లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్‌ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్‌ భూషణ్, ఎంఎల్‌ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్‌) దాఖలు చేశారు. 

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో.. ట్రంప్‌కి పోటీగా ఆయ‌న‌ వీరవిధేయులే!
వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను ఫిబ్ర‌వ‌రి 17న‌ సీల్డ్‌ కవర్‌లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్‌ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

RBI: ఎన్టీఆర్‌ చిత్రంతో రూ.100 వెండి నాణెం
ప్రముఖ తెలుగు సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముఖచిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. ఈ నాణెం మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. దీని కొనుగోలుకు రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింకు, నికెల్‌ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు. 
ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఇలాంటి నాణేలను రిజర్వు బ్యాంకు విడుదల చేస్తుంది. గతంలో ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి చిత్రంతో ఇలా నాణెం విడుదల చేసింది. ఎన్టీఆర్‌ చిత్రంతో నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న పుస్తకంలా 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో' 

ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి అదానీ
టాప్‌-20 ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి గౌతమ్‌ అదానీ వైదొలిగారు. సంస్థకు చెందిన పలు షేర్లు క్షీణించడంతో 23వ స్థానంలోకి అదానీ పడిపోయారు. తాజా ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం అయన సంపద 53.2 బిలియన్‌ డాలర్లు (రూ.4.40 లక్షల కోట్లు). భారత్‌కు చెందిన మరో పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రస్తుతం 83.8 బిలియన్‌ డాలర్ల (రూ.6.94 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు.
అలాగే ఆసియాలో అత్యంత సంపన్నుడు ఇప్పుడు ముకేశ్‌ అంబానీయే. ఫోర్బ్స్‌ జాబితాలో 214 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్, రియల్టీ వ్యాపార సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద 192 బిలియన్‌ డాలర్లు. మూడో స్థానంలో 123 బిలియన్‌ డాలర్ల సంపదతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ కొనసాగుతున్నారు.

Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

Shahabuddin Chuppu: బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడిగా చుప్పూ
బంగ్లాదేశ్ నూత‌న అధ్యక్షుడిగా మహమ్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పూ ఎన్నికైన‌ట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అవామీ లీగ్‌ పార్టీ తరపున చుప్పూ పోటీ చేయ‌గా, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. 74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్‌ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

Cheetahs: యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. వీటిలో ఐదు మగవి, ఏడు ఆడవి. మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ  చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.
భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.  తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది.

చ‌దవండి: చీతా.. చిరుత.. జాగ్వార్‌.. ఈ మూడింటిలో ఏది గ్రేట్‌ అంటే..?

CBIP Award: నెల్లూరు, సంగం బ్యారేజ్‌లకు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డుకు ఎంపికయ్యాయి. పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా నెల్లూరు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్‌ (0.45 టీఎంసీలు)లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసింది. 4.22 లక్షల ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తోంది. 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ) ప్రశంసించింది. అత్యుత్తమ ప్రాజెక్టులుగా నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రకటించి సీబీఐపీ–2022 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును మార్చి 3న సీబీఐపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ రాష్ట్ర అధికారులకు ప్రదానం చేయనున్నారు. సీబీఐపీ దేశంలో నీటివనరులు, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తోంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)
 

Published date : 18 Feb 2023 05:17PM

Photo Stories