Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 15, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 15th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 15th 2023 Current Affairs

Marburg Virus: మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 10 మంది మృతి.. లక్షణాలివే..!  

కరోనా వైరస్‌ కారణంగా గత మూడేళ్ల నుంచి ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి. క‌రోనా మహమ్మారి కనుమరుగవుతుందన్న‌ తరుణంలో మరో వైరస్ ముప్పు ప్రపంచానికి పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్ర‌స్తుతం ఆఫ్రికా దేశంలోని ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ కొత్తరకం ఎబోలా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రమాదకరమైన ఈ వైరస్‌లోనూ ఎబోలా లక్షణాలుంటాయని పేర్కొంది. వైరస్ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను గినియాకు పంపినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ల‌క్ష‌ణాలివే..
ఈ వైరస్ సోకినవారికి జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం జరుగుతుంది, శరీర సామర్థ్యం తగ్గిపోతుంది, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే, వైరస్ సోకినవారితో ప్రత్యక్ష సంబంధం, సన్నహితంగా మెలిగినా లేదా శరీర ద్రవాలు ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను అరికట్టే టీకాలు లేదా చికిత్సలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ, ప్రాణాపాయం నుంచి కాపాడే పలు విధానాలను ఉపయోగిస్తున్నారు. ఇమ్యూన్ థెరపీలు, ఔషధాలు, బ్లడ్ ప్రోడక్ట్స్, అలాగే క్లినికల్ దశలో ఉన్న వ్యాక్సిన్‌లతో చికిత్సలు కొనసాగిస్తుననారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు
ప్రాణాంతకమైన ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందిన ప్రావిన్సులను క్వారంటైన్ చేశామని ఈక్వటోరియల్ గినియా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలోని దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు వెలుగుచూసినట్లు వారం రోజుల కింద‌నే అక్క‌డి ప్రభుత్వం ప్రకటించింది. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్సు పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మితోహా ఒండో అయేకాబా పేర్కొన్నారు. 
కీ-ఎన్‌టెమ్‌లో ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ 4,325 మంది ప్రభావితమయ్యారని, జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య 9 మంది మరణించారన్నారు. వీరి రక్త నమూనాల్లో మార్‌బర్గ్ వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా ఆఫ్రికాలో గతంలో ప్రబలిన ఎబోలాతో చాలా మంది మరణించారు. ఎబోలా కొత్త రూపం మార్‌బర్గ్ ప్రబలుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ హైఅలర్ట్ ప్రకటించింది. వైరస్ నియంత్రణ కోసం అంటువ్యాధి, కేస్ మేనేజ్‌మెంంట్, నియంత్రణ, ల్యాబొరేటరీ, రిస్క్ కమ్యూనికేషన్ నిపుణులను గినియాకు పంపినట్టు పేర్కొంది.

ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన‌..
వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌(WHO) ప్రకారం.. మార్బర్గ్ వైరస్ మరణాల నిష్పత్తి 88 శాతం వరకు ఉంటుంది. ఇది ఎబోలా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ కుటుంబానికి చెందింది. మార్‌బర్గ్ వైరస్ బారినపడ్డ వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యంతో అకస్మాత్తుగా ప్రారంభమతాయి. చాలా మంది రోగులు ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు వెలుగుచూస్తాయి. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)

JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

వైఎస్సార్‌ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ భూమిపూజ చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. స్టీల్‌ ప్లాంట్ నిర్మాణంతో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభించ‌నున్నాయి. 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌ 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. 

Delhi-Mumbai Expressway: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే తొలి దశ ప్రారంభం

జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌చే భూమి పూజ..
చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. గ‌తంలో ఆయ‌న‌ జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 31, 2029 నాటికి పూర్తి..
తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ సిద్ధమైంది. అందుకోసం ఫేజ్‌–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్‌–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్‌ రాడ్స్, బార్‌ మిల్స్‌ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్‌–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్‌–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)

Air India: ‘ఎయిరిండియా’కు 470 కొత్త విమానాలు 
టాటా గ్రూప్‌ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ నుంచి, అమెరికాలోని బోయింగ్‌ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్‌ ఇండియా ఆర్డర్‌ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఎయిర్‌ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్‌ కూడా ఇదే. 
‘‘40 ఎయిర్‌బస్‌ ఏ350 విమానాలు, 20 బోయింగ్‌ 787 విమానాలు, 10 బోయింగ్‌ 777–9 విమానాలు, 210 ఎయిర్‌బస్‌ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్‌ ఇండియా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్‌ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా!
 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్‌–బాడీ విమానాలు  
ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. ఎయిర్‌బస్‌ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్‌–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ తదితరులు వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్‌ మాట్లాడారు. ఎక్కువ సమయం(అ్రల్టా–లాంగ్‌ హాల్‌) సాగే ప్రయాణాల కోసం వైడ్‌–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 
16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అ్రల్టా–లాంగ్‌ హాల్‌ ఫ్లైట్‌ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్‌ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్‌ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్‌ సంస్థ నుంచి 68, ఎయిర్‌బస్‌ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు.   

Missile Strike: క్షిపణి దాడికి ఒక్క నిమిషం చాలు.. మాజీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌కు పుతిన్‌ వార్నింగ్‌

Aero India: ఏరో షోలో అమెరికా బాంబర్‌ జెట్‌ బీ1బీ
బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్‌ వినువీధులో జ‌రుగుతున్న‌ ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్‌ బాంబర్‌ జెట్ ఫిబ్ర‌వ‌రి 14న వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్‌’ అని పిలుస్తారు. ‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్‌ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మేజర్‌ జనరల్‌ జూలియన్‌ చీటర్‌ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్‌ అడ్మిరల్‌ మైఖేల్‌ బేకర్‌ అన్నారు. కాగా, ఫిబ్ర‌వ‌రి 13ప‌ అమెరికా ఐదోతరం సూపర్‌సోనిక్‌ ఎఫ్‌–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకుంది. ఎఫ్‌35ఏ భారత్‌లో ల్యాండ్‌ అవడం ఇదే తొలిసారి. బీ–1బీ బాంబర్‌ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో' ప్రారంభం
 
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్‌
అమెరికాలో భారతీయ మూలాలున్న మహిళా నాయకురాలు, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, రిపబ్లికన్‌ నేత నిక్కీ హేలీ 2024లో జరగ‌నున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. 51 ఏళ్ల నిక్కీ ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి సొంత పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను సవాల్‌ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ‘ప్రెసిడెంట్‌ ఎన్నికల బరిలో అడుగుపెట్టా. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, సరిహద్దు రక్షణ, దేశాన్ని మరింత శక్తివంతం చేయడం, సమున్నత స్థానంలో నిలపడం కోసం నవ్య నాయకత్వం సారథ్యం వహించాల్సిన సమయమొచ్చింది. వలస వచ్చిన భారత కుటుంబం నుంచి వచ్చిన కూతురుగా గర్వపడతాను. నలుపు కాదు. తెలుపు కాదు. నేనింకా భిన్నం’ అని నిక్కీ వ్యాఖ్యానించారు. 
ట్రంప్‌ విధానాలను ఆయన హయాంలోనే తప్పుబట్టిన నిక్కీ.. ట్రంప్‌కు సరైన యువ ప్రత్యామ్నాయంగా తనను తాను అభివర్ణించుకున్నారు. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్, దేశ మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, మైక్‌ పాంపియో, టిమ్‌ స్కాట్‌ తదితర రిపబ్లికన్‌ నేతలూ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అవకాశముంది. బాబీ జిందాల్‌ (2016), ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (2020) తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీపడిన మూడో భారతీయ అమెరికన్‌గా నిక్కీ నిలిచారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ 2024 జనవరిలో మొదలవుతుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)


పంజాబ్‌ నుంచి వలసవచ్చి..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి 1960ల్లో కెనడా వలస వచ్చిన సిక్కు దంపతులు అజిత్‌ సింగ్‌ రణ్‌ధావాలా, రాజ్‌ కౌర్‌ రణ్‌ధావాలాలకు జన్మించిన నిక్కీ పూర్తి పేరు నిమ్రతా నిక్కీ రణ్‌ధావాలా. వారి కుటుంబం కెనడాకు అక్కడి నుంచి అమెరికా వెళ్లింది. 2011 జనవరిలో 39 ఏళ్లకే గవర్నర్‌ పదవి చేపట్టి అమెరికాలో ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిక్కీ చరిత్ర సృష్టించారు. దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా, రెండు సార్లు ఆమె బాధ్యతలు కొనసాగించి రికార్డు నెలకొల్పారు. దాదాపు రెండేళ్లపాటు ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. సాయానికి నాటో దేశాల కీచులాట? కారణాలేంటి?

ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో నాటో దేశాల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయా? ఉక్రెయిన్‌ మరో అఫ్గానిస్తాన్‌గా మారుతుందేమోననే అనుమానాలు నాటో కూటమిలో కలుగుతున్నాయా? ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న సంప్రదాయక యుద్ధం ముదిరి నాటో దేశాలు కూడా ప్రభావితమై భీకర యుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్‌ పద్మవ్యహంలో పీకల దాకా చిక్కుకుపోయామనే సందేహం నాటో దేశాల అధినేతల్లో మొదలవుతోందా?
ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా చేసే విషయంలో నాటో కూటమిలో చెలరేగిన పొరపొ చ్చాలను గమనిస్తే కూటమి మధ్య స్నేహ సంబంధాలు సజావుగా సాగడం లేదని అర్థం అవుతోంది. ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో తామంతా ఒక్కతాటిపై ఉన్నట్లు పైకి చెబుతున్నా నాటో దేశాధినేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నట్లు బయటపడింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)

ఒత్తిడికి తలొగ్గిన అగ్రరాజ్యం..
నాటో కూటమిలో విభేదాలు తలెత్తే పరిస్థితులను గమనించి అమెరికా తలొగ్గక తప్పలేదు. ఉక్రెయిన్‌ బెటాలియన్‌కు సరిపడా 31 అబ్రహం ట్యాంకులను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అయిష్టంగానే అంగీకరించారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరప్‌ దేశాలన్నీ తమ వద్ద ఉన్న లెపర్డ్‌–2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ప్రకటించాయి. నాటో కూటమిలో చీలికలు తప్పవ­ని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు జరుగుతోంది రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కాదని... అమెరికా తెరవెనుక ఉండి నిర్వహిస్తున్న యుద్ధమని అమెరికాలోని రష్యా దౌత్యవేత్త అనతోలి టానోల్‌ వ్యాఖ్యానించారు.  పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

Registration Fee: తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎన్ని వేల కోట్లో తెలుసా!
తెలంగాణ ఏర్పాటైన ఏడాదిలో.. అంటే ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,707 కోట్లు. కానీ ఈ ఏడాది జనవరి వరకు..ఏకంగా రూ.12,000 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విస్తృతమవుతున్న రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత బాగా ఊపందుకున్న రిజిస్ట్రేషన్‌ లావాదేవీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్‌ విలువలు, పెంచిన స్టాంప్‌ డ్యూటీ కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానా కళకళలాడుతోంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

2021–22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 19.88 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జనవరి 31 నాటికి 16.03 లక్షల లావాదేవీలు జరగ్గా, రూ.11,928 కోట్ల ఆదా యం సమకూరినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,600 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య, ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది (2014–15)లో 8.26 లక్షల లావాదేవీలు జరిగి కేవలం రూ.2,707 కోట్ల ఆదాయం మాత్రమే ఖజానాకు రావడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి


Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
 
తెలంగాణ రాష్ట్ర అప్పులు నికరంగా రూ.2,83,452 కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్‌ 2 నాటికి రూ.75,577 కోట్లుగా ఉన్న రుణాలు ఏటేటా పెరుగుతూ రూ.2.83 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు, వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, జాతీయ బ్యాంకులు, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలను సంవత్సరాలవారీగా వెల్లడించాలని కోరుతూ నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఫిబ్ర‌వ‌రి 13న‌ లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 

Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు!

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఈ అప్పుల లెక్కలను వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రుణాలేవీ తీసుకోలేదని పేర్కొన్నారు. 2014 జూన్‌ 2 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రూ.2.84 లక్షల కోట్ల నికర అప్పు తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. నికర అప్పుతోపాటు నాబార్డు, వివిధ బ్యాంకుల నుంచి పలు కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ఈ సమాధానంలో కేంద్రం సవివరంగా పేర్కొంది. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర అప్పులు 2016–17లో రూ. లక్ష కోట్ల మార్కు దాటితే 2019–20లో రూ.2 లక్షల కోట్ల మార్కు దాటాయని వెల్లడించింది. 
12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్ల రుణాలు.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 12 జాతీయ బ్యాంకుల నుంచి కార్పొరేషన్లకు రుణాలు లభించినట్లు కేంద్రం లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించింది. ఈ బ్యాంకులన్నింటి ద్వారా 2014 జూన్‌ నుంచి 2022 అక్టోబర్‌ వరకు మొత్తం రూ. 1.28 లక్షల కోట్లను ప్రభుత్వం పూచీకత్తు ఉండి కార్పొరేషన్లకు ఇప్పించిందని తెలిపింది.  పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)
 

Published date : 15 Feb 2023 06:23PM

Photo Stories