Skip to main content

ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్ ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నిర్ణయించింది.
Current Affairs
అక్టోబర్ 21-23 వరకు వర్చువల్ విధానంలో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం 2021, ఫిబ్రవరి వరకు అమల్లో ఉంటుంది. ‘సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితా(గ్రే లిస్ట్)లోనే పాకిస్తాన్‌ను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ వెల్లడించారు.

ఆరు కీలక షరతులు...
గతంలో అంగీకరించిన 6 కీలక షరతుల అమలు విషయంలో పాకిస్తాన్ విఫలం కావడంతో గ్రే జాబితాలోనే ఆ దేశం కొనసాగే పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్(జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్), హఫీజ్ సయీద్(లష్కరే తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు), జకీఉర్ రహమాన్ లఖ్వీ(లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్)లపై చర్యలు తీసుకోవడం ఆరు కీలక షరతుల్లో ఒకటి.

అనేక ఆంక్షలు...
ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం అందే విషయంలో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న దేశాలపై అనేక ఆంక్షలుంటాయి. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, నగదు అక్రమ రవాణా నివారణలకు ఆయా దేశాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందున
Published date : 24 Oct 2020 07:04PM

Photo Stories