Skip to main content

ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం’ ప్రారంభమైంది. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10న అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంతకుముందు ప్రభుత్వ బాలికల గురుకల పాఠశాల సముదాయం, జేఎన్‌టీయూఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, జేఎన్‌టీయూఏ హంపీ హస్టల్‌లకు శంకుస్థాపన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.

సీఎం జగన్ ప్రసంగం-ముఖ్యాంశాలు
  • కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేయిస్తాం. ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
  • రూ.560 కోట్లతో మూడేళ్ల పాటు చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతాం, ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • ఒకటి.. రెండవ దశల్లో పిల్లలకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తాం. అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని 62,489 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తాం.
  • రెండవ దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన వారికి మరిన్ని పరీక్షలు చేయడంతో పాటు కంటి చికిత్సలు చేయడం, కళ్ల జోళ్లను అందిస్తాం. ఆ తర్వాత ఒక్కో దశ కార్యక్రమాన్ని 6 నెలల పాటు చేపట్టి.. మొత్తం కార్యక్రమాన్ని 31 జనవరి 2022 నాటికి పూర్తి చేస్తాం.
  • తలసేమియా రోగులకు జనవరి నుంచి రూ.10 వేల పింఛన్ పథకాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా పెరాలసిస్‌తో పాటు మరో 4 రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వనున్నాం.
  • ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల ఆపరేషన్ల అనంతరం రోగులు కోలుకునే వరకు ఖర్చుల కింద రోజుకు రూ.225 చొప్పున లేదా ఎక్కువ రోజులైతే నెలకు రూ.5 వేలు సాయం డిసెంబర్ నుంచి అందించనున్నాం.
  • రూ.1,000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. జనవరి 1వ తేదీ నుంచి పెలైట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు అమలు చేయనున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు ఈ పథకం అమలును విస్తరిస్తాం.
  • హంద్రీ-నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో సమాంతర కాలువ నిర్మిస్తాం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు చేసేందుకు
Published date : 11 Oct 2019 04:56PM

Photo Stories