Skip to main content

ఏపీలో కాకతీయులు వేయించిన తమిళ శాసనం ఎక్కడ బయల్పడింది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లిలో ఓరుగల్లు (తెలంగాణ) కేంద్రంగా పాలించిన కాకతీయులు... తమిళ భాషలో వేయించిన శాసనం బయల్పడింది.
మోటుపల్లి కోదండ రామాలయ రాజగోపురం గోడ రాళ్లలో తమిళంలో రాసి ఉన్న శాసనాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆగస్టు 1న గుర్తించారు.

వివరాలు ఇలా...
మోటుపల్లిలో క్రీస్తు శకం 1244వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఓ శాసనం వేయించారు. ఆనాటి సముద్ర వాణిజ్యంలో భాగంగా ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే ఆదుకునేందుకు బీమా పథకాన్ని ప్రారంభిస్తూ.. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో శాసనం రాయించారు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత 1308 ఆగస్టు 1న అదే మోటుపల్లిలో ప్రతాపరుద్రుడు తమిళంలో వేయించిన మరో శాసనం తాజాగా వెలుగు చూసింది. మోటుపల్లిని దేశి ఉయ్యకొండపట్నమని, ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు అందులో ఉంది. వ్యాపార రీత్యా తమిళులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డటంతో ప్రతాపరుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని అంచనా.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : కాకతీయులు వేయించిన తమిళ శాసనం ఎక్కడ బయల్పడింది?
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి
ఎక్కడ : మోటుపల్లి, చినగంజాం మండలం, ప్రకాశం జిల్లా
Published date : 02 Aug 2021 06:01PM

Photo Stories