ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించిన ‘ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు’ ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి విడత ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలు
ఎందుకు : రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి
ఈ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. కార్యక్రమంలో కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- అమూల్ ప్రాజెక్టు ద్వారా భాగంగా తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభమైంది.
- 2020, జూలై 21న మన ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది.
- పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్‌గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఇస్తారు.
- అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు.
9,899 గ్రామాల్లో బీఎంసీలు
- రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి.
- తొలివిడతగా 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఇది ప్రతి నియోజకవర్గం.. 9,899 గ్రామాలకు విస్తరిస్తుంది.
4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు
- మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం.
- ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు) దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7 వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం.
అమూల్‌తో ఒప్పందం వల్ల....
- పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
- ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి విడత ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలు
ఎందుకు : రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి
Published date : 04 Dec 2020 06:15PM