Skip to main content

ఏడుగురు మహిళలకు ప్రధాని సోషల్ ఖాతాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 8న తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు.
Current Affairs
‘‘ఎవరి జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయో ఆ శక్తిమంతమైన ఏడుగురు మహిళలకి నా సామాజిక మాధ్యమాల ఖాతాలను అప్పగిస్తున్నాను. ఇలా చేయడం వల్ల వారు చేస్తున్న సామాజిక సేవ లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ రోజంతా నేను నా అకౌంట్ల నుంచి తప్పుకుంటాను. ఆ ఏడుగురు మహిళలు వారి జీవిత ప్రయాణాన్ని నా అకౌంట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఏడుగురు మహిళలు
స్నేహ మోహన్ దాస్: చెన్నైకి చెందిన స్నేహ ఫుడ్‌బ్యాంక్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆహార వృథాను అరికట్టడం, పేదల ఆకలిని తీర్చడంలో కృషి చేస్తున్నారు.
డాక్టర్ మాళవిక అయ్యర్: తమిళనాడుకి చెందిన మాళవిక ఒక దివ్యాంగురాలు. 13 ఏళ్ల వయసులో రాజస్తాన్‌లో బికనీర్ బాంబు పేలుళ్లలో ఆమె చేతులు కోల్పోయారు. కాళ్లు విరిగిపోయాయి. వంటినిండా ఫ్రాక్చర్లే. అయినా ఆమె పీహెచ్‌డీ చేసి డాక్టరయ్యారు. ఇప్పుడు సామాజిక కార్యకర్తగా పలువురిలో స్ఫూర్తిని నింపుతున్నారు.
ఆరిఫా జాన్: శ్రీనగర్‌కు చెందిన ఆరిఫా కశ్మీర్‌లో సంప్రదాయమైన చేతివృత్తుల్ని పునరుద్ధరించి, వాటికో బ్రాండ్ కల్పించడానికి కృషి చేస్తున్నారు. కశ్మీర్ చేతివృత్తులపై మహిళలకు శిక్షణనివ్వడమే కాకుండా వారి వేతనాలను రోజుకి రూ.175 నుంచి రూ. 450కి పెంచారు.
కల్పన రమేష్: హైదరాబాద్‌కి చెందిన ఈమె వృత్తిపరంగా ఒక ఆర్కిటెక్ట్. కానీ ఆమె తన జీవితాన్ని నీటి సంరక్షణకే అంకితం చేశారు. టెడ్‌ఎక్స్ స్పీకర్... తాను డిజైన్ చేసిన నీటి సంరక్షణని విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ (సాహె) సంస్థను స్థాపించి వాననీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
కళావతి దేవి: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన కళావతి దేవి ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ఆమె విసృ్తతంగా పోరాడుతున్నారు.
వీణా దేవి: బిహార్‌లో ముంగూర్ జిల్లాకు చెందిన వీణా దేవి పుట్టగొడుగుల సాగుతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. పుట్టగొడుగుల్ని సాగు చేయడంలో, సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పించి రైతుల ఆర్థిక స్థితిగతుల్ని పెంచారు.
విజయ పవార్: మహారాష్ట్రకు చెందిన విజయ పవార్ బంజారా చేతివృత్తుల మహిళలతో కలిసి రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలోని గ్రామీణ గోర్మతి కళలో నిపుణులైన మహిళల్ని ప్రోత్సహిస్తూ వారి తయారు చేసిన ఉత్పత్తుల్ని విక్రయించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
Published date : 10 Mar 2020 06:53PM

Photo Stories