Skip to main content

ఏ రెండు దేశాల మధ్య బెకా రక్షణ ఒప్పందం కుదిరింది?

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో... భారత్, అమెరికా దేశాల మధ్య కీలకమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి.
Current Affairs

అక్టోబర్ 27న న్యూఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్, భారత్‌ తరఫున విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, అమెరికాల మధ్య ఇవి మూడో విడత 2+2 చర్చలు. చర్చల సందర్భంగా అణు శక్తి, సహజవాయువు, చమురు, అంతరిక్షం, ఆరోగ్యం, సైబర్‌ సెక్యూరిటీ, రక్షణ రంగ వాణిజ్యం, ఇరుదేశాల మధ్య ప్రజా సంబంధాలు.. తదితర అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని ఒక సంయుక్త ప్రకటనను వెలువరించాయి. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్, విదేశాంగ మంత్రి పాంపియో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

బెకా రక్షణ ఒప్పందం

  • భారత్, అమెరికా 2+2 చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో కీలకమైన నాలుగు ఒప్పందాల్లో చివరిదైన ‘బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ–బెకా)’ ఒప్పందం కుదిరింది. అత్యాధునిక మిలటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్‌కు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది.
  • నాలుగు కీలక ఒప్పందాల్లో మొదటిదైన ‘జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌(జీఎస్‌ఓఎంఐఏ)’ 2002లో కుదిరింది. ఇది భారత్‌తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం.
  • 2016లో రెండో ఒప్పందం ‘లాజిస్టిక్స్‌ ఎక్స్‌చేంజ్‌ మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఎల్‌ఈఎంఓఏ)’ కుదిరింది. రవాణాకు, మరమ్మతులకు ఇరుదేశాల సైన్యం పరస్పరం సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది.
  • 2018లో మూడో ఒప్పందం ఇరుదేశాలు ‘కమ్యూనికేషన్స్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌(సీఓఎంసీఏఎస్‌ఏ)’పై సంతకాలు చేశాయి. భారత్‌కు అత్యున్నత మిలటరీ సాంకేతికతను అమ్మేందుకు, రెండు దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
  • చివరగా, రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమక్షంలో అక్టోబర్ 27న బెకా కుదిరింది.

క్విక్ రివ్వూ :

ఏమిటి : బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ–బెకా)ఒప్పందంపై సంతకాలు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అమెరికా, భారత్ రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు :అత్యాధునిక మిలటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్‌కు అందించేందుకు
Published date : 28 Oct 2020 05:52PM

Photo Stories