Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 29th కరెంట్ అఫైర్స్
Covid Cases: జనవరిలో పెరగనున్న కరోనా కేసులు.. జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
దేశంలో కరోనాని ఎదుర్కోవడానికి రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని, వచ్చే జనవరిలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తే ఫోర్త్ వేవ్ ముప్పుని ఎదుర్కోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. వచ్చే నెలలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఆస్పత్రి పాలవడం, మరణాలు వంటివి సంభవించకపోవచ్చంది. ‘‘తూర్పు ఆసియా దేశాలను కరోనా వణికించిన తర్వాత 30–35 రోజుల పాటు భారత్‌ను ఈ ఏడాది జనవరిలో థర్డ్ వేవ్ వణికించింది. ఇదొక ట్రెండ్. అందుకే అందరూ జాగ్రత్తలు పాటిస్తే వచ్చే జనవరిలో ముప్పును దాటొచ్చు’’ అని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. గత రెండు రోజుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎంపిక చేసిన 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Omicron Bf-7 Variant: దేశంలో కరోనా బీఎఫ్.7 వేరియంట్
చైనా నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. చైనా నుంచి భారత్ రావాలంటే నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వచ్చే వారం నుంచి అమలు చేసే ఆలోచనలో ఉంది. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్‌ల నుంచి వచ్చే వారికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ మంజూరు చేయడం తప్పనిసరి చేయనుంది. మరోవైపు చైనాలో కరోనా వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వం బయటకు వెల్లడించకపోవడంతో అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. కరోనాలో కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చి పలు దేశాలు మూడు, నాలుగు కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులు అందిస్తున్న వేళ మన దేశంలో నాలుగో డోసు అవసరంపై చర్చ మొదలైంది. భారత్‌లో ఫ్రంట్‌లైన్, ఆరోగ్య సిబ్బందికి నాలుగో డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అయితే వైద్య నిపుణులు నాలుగో డోసు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
Corona Virus: కరోనా ఫోర్త్ వేవ్‌తో మనకు ముప్పు లేదు
Pakistan Terrorists: భీకర ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం
పాకిస్తాన్ నుంచి చొరబడిన నలుగురు సాయుధ ఉగ్రవాదులు డిసెంబర్ 28న జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. గణతంత్ర దినోత్సవాల ముందు ఇది అతిపెద్ద విజయమని జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. ‘‘ఓ వాహనంలో ఉన్న ముష్కరులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. తర్వాత వాహనం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఏడు ఏకే అసాల్ట్ రైఫిల్స్, ఒక ఎం4 రైఫిల్, 3 పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రి దొరికాయి. పారిపోయిన వాహనం డ్రైవర్ కోసం గాలిస్తున్నాం. జమ్మూలోని నార్వాల్ బైపాస్ ఏరియాలో ఓ ట్రక్కు నుంచి ఇటీవలే పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో హైఅలర్ట్‌లో భాగంగా తనిఖీలు చేస్తుండగా జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న వాహనంలో నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు తారసపడ్డారు’’ అని తెలిపారు.
Chalapathi Rao: విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత
Praveen Kumar Srivastava: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా (సీవీసీ) విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను తాత్కాలికంగా నియమించారు. అవినీతి వ్యతిరేక కార్యకలాపాలు నిఘా వేసే సంస్థ కమిషనర్ అయిన సురేష్ ఎన్ పటేల్ పదవీ కాలం డిసెంబర్ 24తో ముగియడంతో శ్రీవాస్తవను తాత్కాలిక కమిషనర్‌గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. కేంద్ర నిఘా సంస్థకు చీఫ్‌గా సీవీసీతో పాటు ఇద్దరు సభ్యులు కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం శ్రీవాస్తవతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్ విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్నారు.
Ministry of Road Transport: 4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది. ‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది.
☛ 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది.
☛ గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి.
☛ 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు.
☛ రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు.
☛ పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి.
Snow Storm: అంధకారంలో అగ్రరాజ్యం.. మంచు తుఫాను విశ్వరూపం
Sribhashyam Vijayasarathi: సంస్కృత పండితుడు శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి (86) డిసెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి శ్రీపురంకాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన విజయసారథి చిన్నప్పటి నుంచే పద్య రచన చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే అయినప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 25న పద్మశ్రీ అవార్డు ప్రకటించగా 2021 నవంబర్ 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
మందాకిని కావ్యంతో ‘మహాకవి’గా గుర్తింపు: ఏడు సంవత్సరాల వయసునుంచే విజయసారథి సంస్కృతం నేర్చుకున్నారు. విజయ సారథికి మహాకవిగా గుర్తింపు తెచ్చిన కావ్యం మందాకిని. మందాకిని రచనను ఆయన కేవలం 48 గంటల్లోనే పూర్తి చేశారు. 150కిపైగా గ్రంథాలను భిన్నమైన సంస్కృత ప్రక్రియల్లో ఆయన రచించారు. తెలంగాణ ప్రభుత్వం ‘విశిష్ట సాహిత్య పురస్కారం’, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యా లయం అందించే మహామహోపాధ్యాయ పురస్కారం, బిర్లా ఫాండేషన్ వాచస్పతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ఆయన అందుకున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Boora Rajeshwari: కాళ్లతోనే కవిత్వం రాసిన కవయిత్రి కన్నుమూత
కాళ్లతో కవిత్వం రాసిన కవయిత్రి బూర రాజేశ్వరి (42) డిసెంబర్ 28న చికిత్స పొందుతూ మృతి చెందారు. వైకల్యంతో జన్మించిన ఆమె శరీరం సహకరించకపోయినా కాళ్లతోనే భావాలను అక్షరీకరించింది. ఐదు వందలకు పైగా రాసిన కవితలను సుద్దాల అశోక్ తేజ పుస్తకంగా అచ్చువేయించారు. రాజేశ్వరి దీనస్థితిని, కాళ్లతోనే కవిత్వం రాసే స్ఫూర్తికి ప్రభావితమైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్యాంశాల్లో ఆమె జీవితగాథను చేర్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ సైతం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. దీనిపై వచ్చే రూ.10 వేల వడ్డీని నెలవారీ పింఛనుగా ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన ఆలనాపాలనా చూసిన తల్లి అనసూర్య రెండేళ్ల క్రితం కరోనాతో మరణించింది. నాలుగు నెలల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది.
US Bomb Cyclone: మంచు గుప్పెట్లో అమెరికా.. మైనస్ 30కి ఉష్ణోగ్రతలు
Niagara Falls: గడ్డకట్టిన నయాగరా అందాలు..!
ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా ఫాల్స్ ఒకటి. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల దాకా పడిపోవడంతో అందాల జలపాతం కాస్తా మంచు కొండగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుండటంతో ఎటుచూసినా మంచు గడ్డలే కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ దగ్గర ఆర్కిటిక్ వాతావరణం నెలకొంది. జలపాతం గడ్డకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నీటి ప్రవాహం మొత్తం గడ్డకట్టి వింటర్ వండర్ ల్యాండ్‌ను తలపిస్తోంది.
ఏటా శీతాకాలంలో జలపాతం తాత్కాలికంగా మంచుముద్దగా మారిపోతుందని, ఈ ఏడాది తుపాన్ ప్రభావంతో కాస్తా ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. శీతాకాలంలో జలపాతం గడ్డకట్టి టెంపరరీ బ్రిడ్జిగా మారేదని తెలిపారు. ఆ సమయంలో పర్యాటకులు మంచుపై నడుస్తూ నదిని దాటే వీలుండేదన్నారు. అయితే, 1912లో ఇలా నది దాటుతుండగా మంచు పెళ్లలు విరిగి ముగ్గురు టూరిస్టులు నదిలోపల పడిపోయారని చెప్పారు. అప్పటి నుంచి జలపాతంపై నడవడాన్ని ప్రభుత్వం నిషేధించిందని వివరించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
ICC Test Rankings: నాలుగో స్థానానికి అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి స్పిన్నర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు తీసిన అశ్విన్ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదే సిరీస్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ పది స్థానాలు మెరుగుపర్చుకొని తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ (16)కు చేరుకున్నాడు. ఇతర భారత బ్యాటర్లలో చతేశ్వర్ పుజారా 19వ స్థానానికి, విరాట్ కోహ్లి 14వ స్థానానికి పడిపోయారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
ICC Emerging Player: ఎమర్జింగ్ ప్లేయర్ రేసులో అర్ష్‌దీప్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం భారత యువ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పోటీ పడుతున్నాడు. ఈ అవార్డు కోసం ఐసీసీ నామినేట్ చేసిన నలుగురు ఆటగాళ్ల జాబితాలో అర్ష్‌దీప్ ఒకడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్, న్యూజిలాండ్ చెందిన ఫిన్ అలెన్, అఫ్గనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్‌లు అవార్డు కోసం నామినేట్ అయ్యారు. 21 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్‌దీప్ 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు.