Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 17th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 17th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

S.Jaishankar: ఉగ్ర అడ్డాగా పాక్.. ఐరాసలో ఎస్‌.జైశంకర్‌ ధ్వజం   
ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ను కేంద్ర స్థానంగా ప్రపంచ దేశాలన్నీ పరిగణిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ‘‘పాక్‌ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉగ్రభూతాన్ని పెంచి పోషించడం మానుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘ఉగ్రవాదం ఎక్కడ పురుడు పోసుకుందో ప్రపంచమంతటికీ తెలుసు. పామును ఇంట్లో పెంచుకుంటే ఎప్పటికైనా కాటేయడం ఖాయమని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అప్పట్లో పాక్‌ను హెచ్చరించారు’’ అని గుర్తుచేశారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదం, సవాళ్లు, పరిష్కార మార్గాలు’ అంశంపై భేటీకి మంత్రి నేతృత్వం వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలో, ఇతర ప్రాంతాల్లో ఉగ్ర దాడుల వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుందని పాక్‌ జర్నలిస్టు ప్రశ్నించగా ‘మీ దేశ మంత్రులనే అడగండి’ అని బదులిచ్చారు.

Current Affairs (Science & Technology) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Hippopotamus: బాలుడ్ని మింగిన హిప్పో..! 
ఉగాండాలోని కబటోరోలో ఇంటికి దగ్గరలో ఉన్న సరస్సు వద్ద రెండేళ్ల వయసున్న పాల్‌ ఇగా ఆడుకుంటుండ‌గా అక్కడికి వచ్చిన నీటిఏనుగు(హిపోపాటమస్) ఆ బాలుడ్ని మింగేసింది. అదే సమయంలో దారిన పోతున్న క్రిస్పస్‌ బగోంజా అనే వ్యక్తి అది చూసి చేతికందిన రాళ్లు తీసుకొని హిప్పోపై విసిరాడు. అంతే.. అందరూ అవాక్కయ్యేలా ఆ హిప్పో వెంటనే ఆ బాలుడ్ని సజీవంగానే కక్కేసింది. స్వల్ప గాయాలతో బాలుడు హిప్పో పొట్టలోంచి బయటకు వ‌చ్చాడు. వెంటనే ఆ బాలుడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లి యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్లు ఇచ్చి చికిత్స చేశారు. హిప్పో కడుపులోకి వెళ్లి తిరిగి రావడం అత్యంత అరుదైన ఘటనని చెబుతున్న ఉగాండా పోలీసులు ఆ బాలుడ్ని మృత్యుంజయుడిగా కీర్తించారు. 

సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా..
నీటిఏనుగు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్  ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి.

Nuclear Power Plants: కొత్తగా 20 అణు విద్యుత్ కేంద్రాలు

Agni-5 Missile: అగ్ని–5 క్షిప‌ణిని ప్ర‌యోగం విజయవంతం
ఒడిశా తీరం నుంచి డిసెంబ‌ర్ 15న అగ్ని–5 క్షిప‌ణిని విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. 1.5 టన్నుల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3, అగ్ని–4 మిస్సైళ్ల పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3,5000 కిలోమీటర్లు కాగా, మూడు దశల సాలిడ్‌ రాకెట్‌ ఇంజన్‌తో కూడిన అగ్ని–5 పరిధి ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్‌–రేంజ్‌ మిస్సైల్‌. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని–5 స్ట్రైకింగ్‌ రేంజ్‌లో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అధికార వర్గాలు తెలిపాయి. అగ్ని–5 త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.   
తోకచుక్క కాదు.. 
భారత్‌లో పలు ప్రాంతాల్లో డిసెంబ‌ర్ 15న‌ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి దర్శనమిచ్చింది. వేగంగా కదులుతున్న ఈ వెలుగు రేఖను చూసి తోకచుక్క కావొచ్చని జనం భావించారు. కొందరు అంతరిక్షం నుంచి జారిపడిన గ్రహశిలగా భ్రమించారు. మరికొందరు ఫ్లయింగ్‌ సాసరని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చివరికి అది మన ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5 అని అధికారులు స్పష్టం చేశారు! 

Weekly Current Affairs (Persons) క్విజ్ (18-24 నవంబర్ 2022)
Supreme Court: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే మేమున్నది.. సుప్రీంకోర్టు 
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు డిసెంబ‌ర్ 16న‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అది రాజ్యాంగమే గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించేందుకు వీల్లేని హక్కు. దానికి విఘాతం కలిగిందంటూ వచ్చే విన్నపాలను ఆలకించడం మా రాజ్యాంగపరమైన విధి. అది మా బాధ్యత కూడా’’ అని స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర విద్యుత్‌ శాఖ పరికరాలు దొంగిలించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితునికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 అభియోగాల్లో ఒక్కోదానికి రెండేళ్ల చొప్పున అతనికి విధించిన జైలు శిక్షను మొత్తంగా రెండేళ్లకు కుదించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేస్తున్నట్టు? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు! అలాంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తుంటాయి. సుప్రీంకోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్‌ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రాలే స్ఫూర్తి’’ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఏ కేసు కూడా సుప్రీంకోర్టు విచారించకూడనంత చిన్నది కాదు, కాబోదు’’ అని స్పష్టం చేశారు.  

Bhupendra Patel: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం

Aquarium Breaks: ప్రపంచంలోని అతి పెద్ద అక్వేరియం బద్దలు! 
ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా గిన్నిస్‌ రికార్డులో ఎక్కిన అక్వేరియం ఉన్నఫ‌లంగా బద్దలైంది. దీంతో అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి. అక్వాడాం అని పిలిచే సిలిండర్‌ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎత్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఉంది. 2003 నుంచి సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్‌ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంద‌ని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు మైనస్‌ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు.

Nuclear Fusion Energy: అనంత శక్తిని ఒడిసిపట్టే.. దారి దొరికింది!

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల విధ్వంసం
ఉక్రెయిన్‌పై డిసెంబ‌ర్ 16న 60 రష్యా క్షిపణులు నాలుగు నగరాల్లో విధ్వంసం సృష్టించాయి. రాజధాని కీవ్‌తోపాటు, ఖర్కీవ్‌లో విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ప్రాణభయంతో భూగర్భ సబ్‌వే స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా దురాక్రమణ మొదలయ్యాక రాజధానిపై జరిగిన రాకెట్‌ దాడుల్లో ఇదొకటని అధికారులు చెప్పారు. రాజధాని గగన తలంలోకి ప్రవేశించిన సుమారు 40 క్షిపణుల్లో 37 క్షిపణులను కూల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. కీవ్‌ టెరిటోరియల్‌ మొబైల్‌ ఆర్మీ మెషీన్‌ గన్‌తో క్రూయిజ్‌ క్షిపణిని కూల్చివేయడం అసాధారణం, నమ్మలేని నిజమని కమాండర్‌ ఒకరు పేర్కొన్నారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంతూరైన క్రివ్విరిహ్‌లోని నాలుగంతస్తుల అపార్టుమెంట్‌పై ఒక క్షిపణి పడింది. పేలుళ్లతో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు. జపొరిజియాపై 15 క్షిపణులు పడ్డాయి. దాడులతో ఖర్కీ వ్, డొనెట్‌స్క్‌ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లకు కరెంటు నిలిచిపోయింది.

Ukraine war: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీ ప్రాణనష్టం

Nirmala Sitharaman: అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి.. నిర్మలా సీతారామన్‌ 
ఫిక్కీ 95వ వార్షిక సమావేశం డిసెంబ‌ర్ 16న‌ ఢిల్లీలో జరిగింది. ఈ సంద‌ర్భంగా భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని ఆమె సూచించారు.  

ICC ODI Rankings: డబుల్‌ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్‌ కిషన్‌..!

ఇప్పుడు ప్లస్‌ 2: భారత్‌ చైనా ప్లస్‌1గా పనిచేస్తోందని, యూరప్‌ ప్లస్‌ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్‌ అన్నారు. ‘‘కనుక ప్లస్‌ వన్‌ ఇప్పుడు ప్లస్‌ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్‌ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్‌ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు.  

☛ Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ నగరాలు

2024–25లో 5 ట్రిలియన్‌ డాలర్లకు: నితిన్‌ గడ్కరీ  
భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

Weekly Current Affairs (Important Dates) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Azhar Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన‌ అజహర్‌ అలీ 
పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాడు, టెస్టు స్పెషలిస్ట్‌ అజహర్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. డిసెంబ‌ర్ 17 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టు అజహర్‌ కెరీర్‌లో చివరిది కానుంది. వంద టెస్టుల మైలురాయికి మూడు మ్యాచ్‌ల ముందే అతను తప్పుకుంటున్నాడు. కెరీర్‌లో 96 టెస్టులు ఆడిన అతను 42.49 సగటుతో 7097 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 302 నాటౌట్‌ అజహర్‌ అత్యధిక స్కోరు. పాక్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంతో అజహర్‌ కెరీర్‌ ముగిస్తున్నాడు. 53 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించినా అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ ఫార్మాట్‌లో 36.90 సగటుతో 1845 పరుగులు సాధించిన అలీ 3 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.   

New Zealand: టెస్టు కెప్టెన్సీకి విలియమ్సన్‌ గుడ్‌బై

BBL: టి20ల్లో అత్యల్ప స్కోరు నమోదు.. 15 పరుగులకే ఆలౌట్‌!
ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌.. ఐపీఎల్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ.. ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్‌ జట్టు.. కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. డిసెంబ‌ర్ 16న‌ అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చాయి. 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్‌ పేసర్‌ హెన్రీ థార్టన్‌ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్‌ అగర్‌ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్‌ 124 పరుగులతో మ్యాచ్‌ గెలుచుకుంది. 0 0 3 0 2 1 1 0 0 4 1.. ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు.

టి20 క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్‌ కప్‌లో భాగంగా చెక్‌ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్‌ కూడా ఇదే.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 17 Dec 2022 06:35PM

Photo Stories