Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 12th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 12th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Suicide Bombers: సూసైడ్‌ బాంబర్లుగా శునకాలు! 
ఉక్రెయిన్‌పై యుద్ధంలో లక్ష మందికిపైగా సైనికుల్ని కోల్పోయిన రష్యా ఇక వీధి కుక్కలను కదనరంగంలోకి దించనుందా? వాటిని ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌లో విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? రష్యా కమ్యూనిస్ట్‌ పార్టీ డిప్యూటీ చీఫ్‌ విక్టోర్‌ మకరోవ్‌ ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే అదే జరిగేలా కని్పస్తోంది. ‘‘జంతువులను, ముఖ్యంగా వీధి కుక్కలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి ఉక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను ఎక్కడిక్కడ పేల్చేయాలి. అప్పుడు మనకు సైనిక నష్టం తగ్గడమే గాక రష్యాలో వీధి కుక్కుల సమస్య కూడా తీరిపోతుంది’’ అంటూ ఆయన విచిత్ర ప్రతిపాదన చేశారు. అయితే ఇంతకన్నా చెత్త ఐడియా మరొకటి ఉండదంటూ సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమీ కొత్త కాన్సెప్ట్‌ కాదు. రెండో ప్రపంచ యుద్ధ వేళ సోవియట్‌ యూనియన్‌ ఇలాగే ఆర్మీ జాగిలాల ద్వారా కనీసం 300కు పైగా జర్మనీ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది! కానీ బాంబులను యుద్ధ ట్యాంకులపైకి విసిరేలా కుక్కలకు శిక్షణ శ్రమతో కూడిందే! ఇక కుక్కలను యుద్ధభూమికి పంపడమంటే రష్యా ఓటమిని ఒప్పుకున్నట్టేనంటూ అమెరికా తదితర దేశాలు ఎద్దేవా చేస్తున్నాయి. రష్యా సైనిక శక్తి నిండుకుంటోంది గనుకే ఇలాంటి ఆలోచనలు చేస్తోందంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నాయి!!  

➤ నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్‌!

Daspletosaurus: రాక్షసబల్లుల రారాజు.. డస్‌ప్లెటొసరస్‌
మనకు ఇప్పటిదాకా తెలిసిన రాక్షసబల్లుల్లో అతి భయంకరమైన టీ రెక్స్‌ (టైరనోసార్‌ రెక్స్‌)లో కొత్త జాతి. టీ రెక్స్‌ను కూడా తలదన్నేంతటి భారీ శరీరం, కళ్ల పక్కగా మొలుచుకొచ్చిన‌ కొమ్ములతో భీతిగొలిపేలా ఉండేదట. రాక్షసబల్లులకు రాజుగా చెప్పదగ్గ ఈ జీవి 7.6 కోట్ల ఏళ్ల కింద ఉత్తర అమెరికాలో స్వేచ్ఛావిహారం చేసేదట. మోంటానాకు ఈశాన్య ప్రాంతంలో దొరికిన పుర్రెలు తదితరాల శిలాజాల ఆధారంగా దీని ఉనికిని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇది బహుశా టీ రెక్స్‌కు అత్యంత పూర్వీకురాలు అయ్యుండొచ్చని వారంటున్నారు. పాత, కొత్త టీ రెక్స్‌ జాతుల మధ్య దీన్ని మిస్సింగ్‌ లింక్‌గా అభివర్ణిస్తున్నారు. ఏకంగా 12 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుండే టీ రెక్స్‌లు 6.8 కోట్ల నుంచి 6.6 కోట్ల ఏళ్ల క్రితం దాకా జీవించాయని చెబుతారు.  

అమరావతి రాజధాని కేసులో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత? 

మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్‌ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్‌ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్‌ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్‌ పేర్కొంది.

Collegium System: కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం..సుప్రీంకోర్టు 
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్‌ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్‌ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది.  
తీర్మానాలే ఫైనల్‌ కాదు   
2018 డిసెంబర్‌ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్‌  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను డిసెంబ‌ర్ 9న‌ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్‌ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్‌మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది.  2018 డిసెంబర్‌ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్‌ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్‌ చేయలేదని పేర్కొంది.  
అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్‌ రిజిజు  
కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. 

Supreme Court: అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో ఎందుకు నియమించారు..?
BWF World Tour: ఒలింపిక్‌ ఛాంపియన్‌కు షాకిచ్చిన ప్రణయ్‌  

బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ను భారత ప్లేయర్‌ ప్రణయ్‌ సంచలన విజయంతో ముగించాడు. వరుసగా తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిన ఈ కేరళ ఆటగాడు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. బ్యాంకాక్‌లో డిసెంబ‌ర్ 9న‌ జరిగిన పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో 12వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 14–21, 21–17, 21–18తో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీఫైనల్‌ చేరిన అక్సెల్‌సన్‌కు ప్రణయ్‌తో 51 నిమిషాలపాటు జరిగిన పోరులో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గ్రూప్‌ ‘ఎ’లో చివరి స్థానంలో నిలిచిన ప్రణయ్‌కు 9000 డాలర్ల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.   

Also read: Black hole: సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం
France: మహిళలకు కండోమ్స్‌ ఫ్రీ
లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్‌టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్‌ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ డిసెంబర్ 10న ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్‌లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది. హెచ్‌ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్‌టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్‌ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్‌ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్‌ ప్రిస్రిప్షన్‌ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్‌లో అబార్షన్‌ ఉచితంగా చేస్తారు. 

Vikram-S: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ కంపెనీ
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం 

ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల చట్రం నుంచి మానవతా దృక్పథంతో చేసే సహాయాలను మినహాయించాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. మానవతా దృక్పథంతో సాయం చేస్తే పాకిస్తాన్‌ వంటి దేశాల్లో ఉగ్రవాద సంస్థలు లాభపడతాయని పేర్కొంది.  యూఎన్‌ అందించే ఆర్థిక సాయంతో ఆ ఉగ్ర సంస్థలు నిధుల సేకరణ, ఉగ్రవాదుల నియామకం చేస్తాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, ఐర్లాండ్‌లు సంయుక్తంగా డిసెంబ‌ర్ 9న‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో 14 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటెయ్యగా భారత్‌ దూరంగా ఉంది. భ్రద్రతా మండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తుండటం తెలిసిందే. మండలి అధ్యక్షురాలు, యూఎన్‌లో భారత్‌ శాశ్వత సభ్యురాలు రుచిరా కాంబోజ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మానవతా దృక్పథంతో చేసే సాయం నిధులు దుర్వినియోగమవడం, వాటితో ఉగ్ర సంస్థలు లబ్ధి పొందడం గతంలో చాలా చూశాం. పాకిస్తాన్‌లో కొన్ని ఉగ్ర సంస్థలు మానవతా సంస్థల ముసుగులో వాటిని సేకరించాయి’’ అన్నారు.

Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌కి పద్మభూషణ్‌ పురస్కారం ప్ర‌దానం

DY Chandrachud: చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ 
చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం(పోక్సో)పై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో డిసెంబ‌ర్ 10న‌ పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్‌ ప్రసంగించారు. ‘ పిల్లలపై లైంగిక అకృత్యాల అంశం సమాజంలో పెనుసమస్యగా తయారైంది. చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ. ఈ సంస్కృతి మారాలి. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ముఖ్యం. పిల్లలను ఎవరైనా తాకినప్పుడు అందులో తప్పుడు ఉద్దేశం ఉందా లేదా అనేది కనిపెట్టే ‘తెలివి’ని పిల్లలకు బోధించాలి. 
లైంగిక వేధింపుల బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు.. కుటుంబపరువు పోతుందని మౌనంగా ఉంటున్నారు. ఇలా మౌనంవహిస్తే బాధిత చిన్నారి వర్ణనాతీత వేదన తీరేదెలా? చిన్నారికి న్యాయం దక్కేదెలా ? ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థాయికి వారిలో ధైర్యం, అవగాహన పెంచాలి. ఇది రాష్ట్రాలు, సమాజంలో సంబంధిత వర్గాల సమిష్టి బాధ్యత’ అని అన్నారు. ‘ కొన్ని రకాల కేసులు న్యాయస్థానాల్లో చూస్తుంటాం. మైనర్లు సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. పోక్సో చట్టంలోని 18 ఏళ్లలోపు వయసు పరిమితి కారణంగా అది నేరమే. 16, 18 ఏళ్లు.. అనే దానిపై ఎలా తీర్పు ఇవ్వాలనే అంశంలో జడ్జీలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రతిరోజూ ఎన్నో కోర్టుల్లో తలెత్తుతోంది. దీనికి పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన అన్నారు.

2022 Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రదానం

Nobelprize winners


స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ కాన్సర్ట్ హాల్ డిసెంబర్ 10న నోబెల్ బహుమతి ప్రదానోత్సవ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 2022 నోబెల్‌ విజేతలు శాంతి, సాహిత్యం, ఆర్థిక, రసాయన, భౌతిక, వైద్య రంగాల్లో  అవార్డులు అందుకున్నారు.

అవార్డు గ్ర‌హీత‌లు..
స్వీడన్‌ శాస్త్రవేత్తకు వైద్యశాస్త్రంలో 'నోబెల్‌': వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన స్వీడన్‌ కు చెందిన శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)ను నోబెల్‌ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన ఆవిష్కరణలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు నోబెల్‌ అవార్డు ప్యానెల్‌ కరోలినా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది.
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి: భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్, జాన్‌ ఎఫ్‌ క్లాసర్, ఆంటోన్‌ జైలింగర్‌ లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్‌ లభించింది. ఫోటాన్లపై ప్రయోగాలు, బెల్‌ సిద్ధాంతంలో చిక్కుముడులు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌లో వీరి పరిశోధనలకు గానూ రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వీరిని గ్రహీతలుగా ఎంపిక చేసింది. 
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి: రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.
సాహిత్య రంగం: ఫ్రెంచ్‌ రచయిత అనీ అర్నాక్స్‌కు సాహిత్యంలో నోబెల్‌ వరించింది. జెండర్, లాంగ్వేజ్,క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్‌ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్‌బహుమతి వరించింది.

Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్‌ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌
ఆర్థిక‌శాస్త్రం: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు అక్టోబ‌ర్ 10వ తేదీన (సోమవారం) నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల‌పై ఈ ముగ్గురి ప‌రిశోధ‌న‌లకుగాను రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది.
నోబెల్‌ శాంతి బహుమతి: బెలారస్‌ ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీతోపాటు రష్యా, ఉక్రెయిన్‌ సంస్థలకు సంయుక్తంగా అత్యున్నత గౌరవం. మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్‌ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్‌ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్‌’, ఉక్రెయిన్‌ సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్‌ శాంతి బహుమతిని అక్టోబర్ 7న ప్రకటించింది. 

Supreme Court: ‘నోట్ల రద్దు’పై రికార్డులు సమర్పించండి
Grant Wahl: మ్యాచ్‌ కవర్‌ చేస్తూ ‘సాకర్‌’ జర్నలిస్ట్‌ మృతి
అమెరికాకు చెందిన ప్రముఖ క్రీడా పాత్రికేయుడు గ్రాంట్‌ వాల్‌ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా చనిపోయాడు. ఫుట్‌బాల్‌ స్పెషలిస్ట్‌ జర్నలిస్ట్‌ అయిన గ్రాంట్‌ ప్రస్తుతం ఖతర్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ విశేషాలను అందిస్తున్నాడు. అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను కవర్‌ చేస్తున్న అతను తన సీట్‌లోనే కుప్పకూలిపోయాడు. అత్యవసర వైద్య సేవలు అందించినా అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బుధవారమే తన 49వ పుట్టిన రోజు జరుపుకున్న గ్రాంట్‌ తీవ్ర అలసట, ఒత్తిడి కారణంగా అనారోగ్యంబారిన పడినట్లు సమాచారం. పలు ప్రతిష్టాత్మక మీడియా సంస్థల్లో పని చేసిన అతనికి జర్నలిస్ట్‌గా ఇది ఎనిమిదో ప్రపంచ కప్‌. టోర్నీ ఆరంభంలో హోమోసెక్సువాలిటీకి మద్దతుగా ఇంద్రధనుస్సు రంగులతో కూడిన జెర్సీతో అతను రాగా, ఖతర్‌ నిబంధనల ప్రకారం అధికారులు అభ్యంతరం చెప్పారు. ‘ఫిఫా’ ప్రత్యేకంగా సన్మానించిన జర్నలిస్ట్‌లలో అతను ఒకడు.   

New Zealand: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు

PT Usha: ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష
భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం, పరుగుల రాణి పీటీ ఉష క్రీడా పరిపాలకురాలి హోదాలో కొత్త బాధ్యతలు చేపట్టింది. ప్రతిష్టాత్మక భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికైంది. ఈ పదవికి మరో నామినేషన్‌ లేకపోవడంతో ఉష ఏకగ్రీవ ఎంపిక గతంలోనే ఖరారు కాగా.. డిసెంబ‌ర్ 10వ తేదీ దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58 ఏళ్ల ఉష గుర్తింపు పొందింది. లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, షూటర్‌ గగన్‌ నారంగ్‌ ఒక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులలో డోలా బెనర్జీ (ఆర్చరీ), యోగేశ్వర్‌ దత్‌ (రెజ్లింగ్‌) ఉండగా.. అథ్లెటిక్స్‌ కమిషన్‌ సభ్యులుగా మేరీకోమ్‌ (బాక్సింగ్‌), ఆచంట శరత్‌కమల్‌ (టేబుల్‌ టెన్నిస్‌) ఎంపికయ్యారు.   

Sukhvinder Singh: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌ 
హిమాచల్‌ప్రదేశ్‌ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు (58) డిసెంబ‌ర్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి (60) ప్రమాణం చేశారు.  
కౌన్సిలర్‌ నుంచి సీఎం వరకు.. 
అంచెలంచెలుగా ఎదిగిన పోరాట యోధుడు కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి ముఖ్య మంత్రి వరకు సుఖ్విందర్‌ సుఖు అంచెలంచెలుగా ఎదిగారు. సిమ్లాలో వార్డు కౌన్సిలర్, యువజన విభాగం అధ్యక్షుడు,  హమీర్పూర్‌ జిల్లా నాదౌన్‌ ఎమ్మెల్యే, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు సీఎం.. ఇలా అన్ని స్థాయిల్లో పదవుల్ని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత చరిష్మా ఉన్న దివంగత సీఎం వీరభద్రసింగ్‌ ప్రత్యరి్థగా ఉంటూనే పారీ్టలో స్వయంశక్తితో ఎదిగారు. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీకి నేతృత్వం వహించి విజయతీరాలకు చేర్చారు. నాదోన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్‌ అగ్నిహోత్రికి మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వంటి హేమాహేమీల ప్రచారాన్ని తట్టుకుని మరీ గెలిచారు.
1964 మార్చి 27న నాదోన్‌లో సాధారణ కుటుంబంలో సుఖు జన్మించారు. తండ్రి రషీల్‌ సింగ్‌ రాష్ట్ర రవాణా కార్పొరేషన్‌లో డ్రైవర్‌. విద్యారి్థగా ఫీజుల కోసం సిమ్లాలో పాలమ్మేవారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. 1989 నుంచి ఆరేళ్ల పాటు విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్నారు. 1998 నుంచి పదేళ్లు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర చీఫ్‌గా చేశారు. 1992, 1997ల్లో సిమ్లా కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా నెగ్గారు. 2003లో నాదౌన్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీపై ఆయనకున్న పట్టు, కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం 2013లో పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆరేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా ముఠా సంస్కృతిని ప్రోత్సహించకుండా కార్యకర్తలతో, నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడని పేరుంతివే ఆయన్ను సీఎం పీఠానికి దగ్గర చేశాయి. వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ను కాదని మరీ 25 మంది ఎమ్మెల్యేలు సుఖుకే మద్దతు పలికారంటే ఆయనకున్న మంచిపేరే కారణం. అందుకే అధిష్టానం సుఖు నాయకత్వ సామర్థ్యానికే ఓటేసింది.

Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు

Orion: క్షేమంగా భూమికి ఓరియాన్‌

Orion


చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఓరియాన్‌ క్యాప్సూల్ డిసెంబ‌ర్ 11న‌ రాత్రి క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. చంద్రుడి చుట్టూ 25 రోజులపాటు ప్రదక్షిణలు చేసిన ఓరియాన్‌ భారత కాలమానం ప్రకారం డిసెంబ‌ర్ 11న అర్ధ‌రాత్రి మెక్సికోలోని బజా ద్వీపకల్పంలో పసిఫిక్‌ సముద్ర తీరంలో దిగింది. దీన్ని నవంబర్‌ 16న కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించడం తెలిసిందే. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది.

ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్‌ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది.
ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్‌ ల్యాండింగ్‌ కోసం నాసా తొలిసారిగా ‘స్కిప్‌ ఎంట్రీ’ టెక్నిక్‌ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్‌ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట.
అంతిమంగా ఓరియాన్‌ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్‌ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ‘‘దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం’’ అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్‌హీడ్‌–మార్టిన్‌ తయారు చేసిన అత్యంత మందమైన హీట్‌ షీల్డ్‌ను ఓరియాన్‌కు అమర్చారు.

Adani Stocks: సంపద సృష్టిలో పోటాపోటీ.. అదానీ గ్రూప్‌ కంపెనీల హవా​​​​​​​
Heart Attacks: అతి వ్యాయామంతో యువతలో గుండెపోటు! 
ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలె్రస్టాల్‌ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, అలవాటు లేని వ్యాయామాలు లేక అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. 25 నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్‌ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లే కుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విజయకుమార్‌ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్‌సైజ్‌లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్‌ కుమార్‌ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. 

➤ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?

PM Narendra Modi: రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
భారత్‌లో సుస్థిరాభివృద్ధి జరగాలని మన దేశానికి షార్ట్‌ కట్‌ పాలిటిక్స్‌ అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రధాని మోదీ డిసెంబ‌ర్ 11న‌ రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. నాగపూర్‌–ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వేలో షిర్డీ దాకా తొలి దశని ప్రారంభించిన మోదీ ఆ రహదారిపై కాసేపు కారులో ప్రయాణించారు. నాగపూర్‌–బిలాస్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును, నాగపూర్‌ మెట్రో రైలు, ఎయిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్‌ కేంపస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశాభివృద్ధి విషయంలో సంకుచిత ధోరణి ప్రదర్శిస్తే అవకాశాలు పరిమితంగానే లభిస్తాయన్నారు. ‘‘అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధితోనే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా నిలబడుతుంది. సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌ అన్న సూత్రంతోనే ముందుకు వెళుతున్నాం’’ అని చెప్పారు.  
ఆయుర్వేదం వైపు  ప్రపంచం చూపు 
ప్రపంచ దేశాలన్నీ ఆయుర్వేదం వైపు చూస్తున్నాయని మోదీ చెప్పారు. గోవాలో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద, ఘజియాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసన్, ఢిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతిలను గోవా నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. గోవాలో డిసెంబ‌ర్ 11న తొమ్మిదో ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌ ముగింపులో పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్యం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 

 

Published date : 12 Dec 2022 07:53PM

Photo Stories