Skip to main content

దక్షిణాదిలో తొలి కిసాన్ రైలును ఎక్కడ పారంభించారు?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం-ఢిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభమైంది. 2020, సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
Current Affairs

ఢిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి, అనంతపురం నుంచి ఎంపీ టి.రంగయ్య, సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, గుంతకల్ నుంచి డివిజినల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపారు. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి కిసాన్ రైలు కాగా, దేశంలో రెండవది. కిసాన్ రైలు ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

చదవండి: దేశంలోనే తొలి కిసాన్ రైలును ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?

సీఎం జగన్ ఏమన్నారంటే..

  • దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్స్ క్యాపిటల్ (పండ్ల రాజధాని) గా నిలుస్తోంది.
  • దేశ వ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో ఏపీ వాటా 15.6 శాతం ఉంది.
  • కిసాన్ రైలు ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద పెద్ద నగరాలకు చేరనున్నాయి.
  • రాష్ట్రంలో 17.42 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా, 312.75 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.
  • టమాటా, బొప్పాయి, కోకో, మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. మామిడి, ఆరెంజ్, పసుపు ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
  • అరటి ఎగుమతుల కోసం ప్రభుత్వం 2020, జనవరిలో అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి 49 రిఫ్రిజిరేటర్ల కంటెయినర్లతో ప్రత్యేక రైళ్లు నడిపాం. ముంబయి పోర్టు మీదుగా పలు దేశాలకు ఎగుమతి చేశాం. ఇందుకుగాను ఏపీకి ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీ అవార్డు దక్కింది.
  • ప్రస్తుతం కిసాన్ రైలులో 214 టన్నుల టమాటా, 75 టన్నుల అరటి, 20 టన్నుల బత్తాయి, 2.5 టన్నుల బొప్పాయి, 8 టన్నుల ఖర్బూజ, పుచ్చకాయలు, 3 టన్నుల మామిడి రవాణా అవుతున్నాయి. 14 వ్యాగన్లలో 3 వ్యాగన్ల టమాటా సెప్టెంబర్ 10న నాగపూర్ మార్కెట్‌కు వెళుతుంది. మిగతా 11 వ్యాగన్ల ఉత్పత్తులు అజాద్‌పూర్ మండీకి వెళతాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి కిసాన్ రైలు ఎప్పడు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 9, 2020
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి
ఎక్కడ : అనంతపురం-ఢిల్లీ
ఎందుకు : తక్కువ ధరలకే రైతుల పంటలను రవాణా చేసేందుకు
Published date : 10 Sep 2020 05:07PM

Photo Stories