Skip to main content

Daily Current Affairs in Telugu: డైలీ కరెంట్‌ అఫైర్స్‌ సెప్టెంబర్‌ 6

Manish Narwal

Manish Narwal: పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన మనీశ్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు? 

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌ స్వర్ణం పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో భాగంగా జపాన్‌ రాజధాని టోక్యోలో సెప్టెంబర్‌ 4న జరిగిన షూటంగ్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్‌ నర్వాల్‌ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్‌ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారతీయ షూటర్‌ సింగ్‌రాజ్‌ అధానా 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలవడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సింగ్‌రాజ్‌ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.

రెండో క్రీడాకారుడిగా... 
తాజా ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్‌(హరియాణా) గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్‌ జోగిందర్‌ సింగ్‌ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్‌ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది.

ఫుట్‌బాలర్‌ కావాలనుకొని...
హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్‌ జన్మతః కుడి చేతి వైకల్యంతో జన్మించాడు. తొలుత ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అయితే కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. అనంతరం షూటింగ్‌లో ప్రాక్టీస్‌ చేసిన మనీశ్‌... 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్‌ పారా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020లో స్వర్ణం గెలిచిన భారతీయ షూటర్‌? 
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు : మనీశ్‌ నర్వాల్‌(మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌)
ఎక్కడ : టోక్యో, జపాన్‌ 

2+2 Ministerial Dialogue: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు ఎక్కడ జరగనున్నాయి?  

భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు 2021, నవంబర్‌ నెలలో వాషింగ్టన్‌ నగరంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా సెప్టెంబర్‌ 4న తెలిపారు. ఈ దఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్‌ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్‌ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు.

భారత్‌ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
అఫ్గాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్‌ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, నవంబర్‌లో భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 4
ఎవరు    : భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షికం, రక్షణ, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...

 

Y-Break App: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వై–బ్రేక్‌ యాప్‌ ఉద్దేశం? 

పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్‌(విరామం) ప్రవేశపెట్టింది. ఒక ఐదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్‌ శాఖ  ‘‘వై–బ్రేక్‌(యోగా బ్రేక్‌)’’ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. 2021, సెప్టెంబర్‌ 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్‌ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ సెప్టెంబర్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సెప్టెంబర్‌ 1న ప్రారంభం...
యోగా బ్రేక్‌కు 2020, జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్‌ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. 2021, సెప్టెంబర్‌ 1న కేంద్రం వై–బ్రేక్‌ యాప్‌ని ప్రారంభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వై–బ్రేక్‌(యోగా బ్రేక్‌) మొబైల్‌ యాప్‌ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 1
ఎవరు : కేంద్ర ఆయుష్‌ శాఖ  
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు  : ఉద్యోగులకు 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని అమలు చేయడంలో భాగంగా... 

 

IUCN: అంతరించిపోతున్న జీవజాలం వివరాలను నమోదు చేసే సంస్థ?

అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్‌(ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్‌ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితా(రెడ్‌ లిస్ట్‌)లోకి ఎక్కిందని ఐయూసీఎన్‌ తెలిపింది. ప్రస్తుతం ఐయూసీఎన్‌ డైరెక్టర్‌గా బ్రూనో ఒబెర్లె ఉన్నారు. ఐయూసీఎన్‌ తెలిపిన వివరాల ప్రకారం...

  •  2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయింది.
  • పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయి.
  • చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్‌ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి.
  • షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణం.
  • సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించింది.
  • ఐయూసీఎన్‌ సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి.
  • పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉంది. 
  • కరిగిపోతున్న మంచుతో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్‌ పెంగ్విన్లు నశించిపోయే ప్రమాదం ఉంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  
కొమొడో డ్రాగన్‌ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితా(రెడ్‌ లిస్ట్‌)లోకి ఎక్కింది
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు : ఐయూసీఎన్‌(ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) 
ఎందుకు  : పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ కారణాల వల్ల...


Peace Agreement: ఏ రాష్ట్రంలోని వేర్పాటువాదులతో కేంద్రం శాంతి ఒప్పందం చేసుకుంది?

అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్‌ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అదే రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 4న జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్‌లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్‌ చచార్‌ హిల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కార్బీ లోంగ్రీ, యునైటెడ్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ, కార్బీ పీపుల్స్‌ లిబరేషన్‌ టైగర్స్‌ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అస్సాం రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో శాంతి ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్‌ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా...


Pramod Bhagat: పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?

టోక్యో పారాలింపిక్స్‌–2020 బ్యాడ్మింటన్‌ పోటీల్లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–3 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబర్‌ 4న జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ ప్రమోద్‌ 21–14, 21–17తో రెండో సీడ్‌ డానియెల్‌ బెథెల్‌ (బ్రిటన్‌)ను ఓడించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్‌... 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టి ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం.

మనోజ్‌ సర్కార్‌కు కాంస్యం...
బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–3 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్‌ సర్కార్‌ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్‌ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్‌)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్‌ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్‌ వైపు ఆకర్షితుడైన మనోజ్‌ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు : ప్రమోద్‌ భగత్‌
ఎక్కడ : టోక్యో, జపాన్‌
ఎందుకు : పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–3 విభాగం ఫైనల్లో టాప్‌ సీడ్‌ ప్రమోద్‌ 21–14, 21–17తో రెండో సీడ్‌ డానియెల్‌ బెథెల్‌ (బ్రిటన్‌)ను ఓడించినందున...


Nipah Virus: దేశంలో తొలుత నిఫా వైరస్‌ను ఏ నగరంలో గుర్తించారు? 

కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్‌ బయటపడింది. నిఫా వైరస్‌ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి సెప్టెంబర్‌ 5న వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. కాగా, దేశంలో మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్‌ బారినపడిన 17 మంది చనిపోయారు. తొలుత 2018, మే 19న కోజికోడ్‌లో ఈ వైరస్‌ను గుర్తించారు.

ఏమిటీ నిఫా..!
ఇది›జూనోటిక్‌ వైరస్‌. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్‌ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

లక్షణాలేమిటి?

  • బ్రెయిన్‌ ఫీవర్‌  
  • తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. 
  • ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు 
  • ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం.  
  • కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం
  • 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది.  – మనిషి శరీరంలో ఈ వైరస్‌ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు.

గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్‌–టైమ్‌ పాలీమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ–పీసీఆర్‌) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్‌ ఐసోలేషన్‌ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు.

మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది?
నిఫా వైరస్‌ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్‌ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు  ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్‌  ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్‌ బారినపడిన వారికి దూరంగా ఉండాలి.

చికిత్స ఉందా?: నిఫా వైరస్‌ బాధితులకు ప్రస్తుతానికి నిర్ధిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్‌ డ్రగ్‌ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్‌ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు.


Electric Air Taxi: ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై ప్రయోగాలు చేస్తోన్న సంస్థ? 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా... ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై ప్రయోగాలు ప్రారంభించింది. తాజాగా జోబీ ఏవియేషన్‌తో కలిసి ‘‘ఆల్‌ ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేక్‌ఆఫ్‌ అండ్‌ లాండింగ్‌(ఇవీటీఓఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌’’లపై ప్రయోగాలు ఆరంభించింది. టేకాఫ్‌ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్‌ అంటారు. ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్‌టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

ఇవీటీఓఎల్‌ వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్‌ ఎయిర్‌ మొబిలిటీ) నేషనల్‌ కాంపైన్‌లో భాగంగా ఈ వాహనాలపై నాసా ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్‌ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జోబీ ఏవియేషన్‌తో కలిసి ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీ ‘‘ఇవీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’’లపై ప్రయోగాలు ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 4
ఎవరు    : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 
ఎక్కడ    : జోబీ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : వేగవంతమైన రవాణా కోసం... 
 

Published date : 07 Sep 2021 07:16PM

Photo Stories